హిందీని రుద్దాలని చూస్తే.. రూల్స్ బ్రేక్ చేస్తాం..!
సాహితీ ప్రేమికులుగా హిందీ సాహిత్యాన్ని ఆరాధిస్తామని, అంతమాత్రాన అదే భాషను మాట్లాడాలనే నిబంధనలు పెడితే మాత్రం కచ్చితంగా ఆ రూల్స్‌ని బ్రేక్ చేస్తామన్నారు కవిత.
వన్ నేషన్- వన్ ఎలక్షన్, వన్ లాంగ్వేజ్ పేరుతో కేంద్రం చేస్తున్న ప్రతిపాదనల పట్ల దక్షణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హిందీ భాషను కేంద్రం బలవంతంగా అన్నిరాష్ట్రాలపై రుద్దాలనుకోవడం సరికాదంటూ దక్షణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హిందీ భాషపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ ఎన్. గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారాన్ని అందించిన ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ సాహిత్యమంటే తనకు చాలా ఇష్టమన్నారు. హిందీ పాటల్లో సాహిత్యం అద్భుతంగా ఉంటుందన్నారు. అంతమాత్రాన హిందీ భాషను మాత్రమే మాట్లాడాలనే ఆంక్షల్ని సహించబోమన్నారు. ఎవరి భాష వాళ్లకు ఉంటుందని, కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేయడం సరైంది కాదన్నారు.
సాహితీ ప్రేమికులుగా హిందీ సాహిత్యాన్ని ఆరాధిస్తామని, అంతమాత్రాన అదే భాషను మాట్లాడాలనే నిబంధనలు పెడితే మాత్రం కచ్చితంగా ఆ రూల్స్‌ని బ్రేక్ చేస్తామన్నారు కవిత. ఇప్పుడు దేశంలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోందని, ఒకే భాషను దేశ ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ముందే తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ సమానత్వం కోసం గొంతెత్తారని కవిత గుర్తుచేశారు. ఆది హిందూ సంస్థ ద్వారా విశేష కృషిచేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలలో రాష్ట్ర సాధనతో పాటు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం కూడా భాగమన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సాహిత్య వికాసానికి కృషి చేయడంతో పాటు, సాహితీవేత్తలను స్మరించుకోవడం అవసరమన్నారు. తెలుగు సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు భారత్ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహితీ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం తెలంగాణ సాహిత్య సభలు జరుపుతామన్నారు.