Telugu Global
Telangana

ఆ విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - ఎమ్మెల్సీ కవిత

మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ విషయం అసంతృప్తికి గురిచేసేదే అయినా, సీడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగినదేనని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.

ఆ విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం - ఎమ్మెల్సీ కవిత
X

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చ జరిగింది. రేపటి నుంచి మొదలు కాబోతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారాయన. ఈ విషయంలో కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్సీ కవిత.


మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ విషయం అసంతృప్తికి గురిచేసేదే అయినా, సీడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగినదేనని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే దూకుడు ప్రదర్శించాలని ఆశించారామె. అధికార పార్టీపై కాంగ్రెస్ ఒత్తిడి తేవాలన్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు లింగ సమానత్వంలో మరో ముందడుగు అని చెప్పారు కవిత.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈసారి పార్లమెంట్ లో కీలక చర్చ జరిగే అవకాశముంది. ప్రతిపక్షాలన్నీ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. కొన్ని పార్టీలు ఆమె దీక్షకు మద్దతు తెలిపాయి. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ తర్వాత మరోసారి మహిళా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ లిస్ట్ లో మహిళలకు ఎక్కువ స్థానాలు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. చట్టం తెస్తే అన్ని పార్టీలు సమాన అవకాశాలు కచ్చితంగా ఇవ్వాల్సిందేకదా అని కవిత సమాధానమిచ్చారు. మీ పార్టీ ఎన్నిసీట్లిస్తుందో చూద్దామని కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తయారయితే అన్ని పార్టీలు అతివను అందలమెక్కించాల్సిందే. ఆ చట్టం కోసమే కవిత సహా మరికొందరు పోరాటం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కూడా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు. ఇప్పుడు హైదరాబాద్ సీడబ్ల్యూసీలో మహిళా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ తీర్మానం చేసింది.

First Published:  17 Sept 2023 5:21 PM IST
Next Story