Telugu Global
Telangana

కార్టూన్లకంటే చేతలే గట్టిగా మాట్లాడతాయి

బీజేపీ అడిగేది మహిళలకు కేటాయించిన సీట్ల గురించి. అంటే రాజకీయాల్లో మహిళల గౌరవం గురించే అనుకోవాలి. అలాంటి బీజేపీ సాటి మహిళా నాయకురాలు కవితను అవమానిస్తూ వేసిన కార్టూన్లను ఎలా చూడాలి అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కవితను అవమానకరంగా చిత్రీకరిస్తూ బీజేపీ వేసిన కార్టూన్లు తీవ్ర చర్చకు దారి తీశాయి.

కార్టూన్లకంటే చేతలే గట్టిగా మాట్లాడతాయి
X

"యాక్షన్ స్పీక్ లౌడర్ దేన్ కార్టూన్స్" అంటూ ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తనను టార్గెట్ చేస్తూ తెలంగాణ బీజేపీ వేసిన ఓ కార్టూన్ ని జత చేస్తూ ఆమె ఈ ట్వీట్ వేశారు. తెలంగాణ బీజేపీ చేసిన పని తనకేమీ కొత్తగా అనిపించడంలేదని, అయితే వారి వ్యాఖ్యలతో తాను నిరాశ చెందానన్నారు.

టార్గెట్ కవిత..

తెలంగాణలో బీఆర్ఎస్ జాబితా ప్రకటించినప్పటి నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ బీజేపీ గగ్గోలు పెడుతోంది. అదే సమయంలో బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా మిగతా నేతలు కూడా ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్లకోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ కౌంటర్లిస్తున్నారు. దీనిపై గతంలోనే కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు మహిళా రిజర్వేషన్ల బిల్లుని తొక్కి పెట్టింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళలు కేవలం సర్పంచ్ లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మిగిలిపోవాలా అని ప్రశ్నించారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్లపై చట్టం చేస్తే, ఇప్పుడు అన్ని పార్టీలు మహిళలకు సముచిత స్థానం కల్పించేవి కదా అని అడిగారు. అయినా కూడా బీజేపీ వెనక్కి తగ్గకుండా కవితను టార్గెట్ చేస్తూ కౌంటర్లివ్వడం విశేషం.


మహిళా నేతపై నిస్సిగ్గుగా కార్టూన్లు..

బీజేపీ అడిగేది మహిళలకు కేటాయించిన సీట్ల గురించి. అంటే రాజకీయాల్లో మహిళల గౌరవం గురించే అనుకోవాలి. అలాంటి బీజేపీ సాటి మహిళా నాయకురాలు కవితను అవమానిస్తూ వేసిన కార్టూన్లను ఎలా చూడాలి అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కవితను అవమానకరంగా చిత్రీకరిస్తూ బీజేపీ వేసిన కార్టూన్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. కవిత కూడా ఈ విషయంలో నొచ్చుకున్నా.. ధైర్యంగా సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మాని, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించే దిశగా పని చేయాలంటూ ఆమె బీజేపీ నేతలకు చురకలంటించారు.

First Published:  24 Aug 2023 12:38 PM IST
Next Story