Telugu Global
Telangana

మహిళలు సర్పంచ్ లు, ఎంపీటీసీలుగానే మిగిలిపోవాలా..?

2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు పార్లమెంట్ ఆమోదం పొందలేదని, ఎందుకు చట్టంగా మారలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు.

మహిళలు సర్పంచ్ లు, ఎంపీటీసీలుగానే మిగిలిపోవాలా..?
X

మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత అజెండా కాదని, దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేద్కర్‌ కూడా కొట్లాడారని ఆమె గుర్తుచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మహిళల సంఖ్య తక్కువగా ఉందనే విమర్శల నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చారు. ప్రస్తుత పార్లమెంటులో మహిళా సభ్యులు కేవలం 12 శాతం మాత్రమే అని గుర్తు చేశారు కవిత. తొలి లోక్‌ సభలో 8 శాతం మహిళా ఎంపీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్‌లో కేవలం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. దీనంతటికీ కారణం చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత.


బీజేపీ మోసం..

2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు పార్లమెంట్ ఆమోదం పొందలేదని, ఎందుకు చట్టంగా మారలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు. మోదీ ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. తప్పు వారిదయితే.. కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కవిత.

మరోసారి దీక్ష..

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం డిసెంబర్‌ లో మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్‌ దక్కని అందరికీ పార్టీ తగిన ప్రాధాన్యం కల్పిస్తుందని స్పష్టం చేశారు కవిత. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు.

First Published:  23 Aug 2023 2:26 PM IST
Next Story