Telugu Global
Telangana

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ ఏమైంది..? – ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరి అవలంబిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని.. మరో రాష్ట్రంలో అవే పార్టీలను వ్యతిరేకిస్తుందన్నారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ ఏమైంది..? – ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
X

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ ఏమైందని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీజేపీతో అవగాహన కుదిరినందుకే కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీల‌పై పెట్టిన ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు కదలడం లేదా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహన ఏమిటో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతమంటూ ఈ సందర్భంగా కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ, ప్రజలను మరోసారి మభ్యపెట్టొద్దని చెప్పారు.

కాంగ్రెస్‌వి మోసపూరిత, ద్వంద్వ విధానాలు..

కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వైఖరి అవలంబిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని.. మరో రాష్ట్రంలో అవే పార్టీలను వ్యతిరేకిస్తుందన్నారు. ఒక ప్రాంతంలో ఆప్‌తో కొట్లాడుతూ.. మరోచోట అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అదానీకి రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతూ.. ఇతర రాష్ట్రాల్లోనేమో వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ మోసపూరిత, ద్వంద్వ విధానాలు ప్రజలకు అర్థమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.



మహిళా బిల్లును సోనియా ఎందుకు ప్రస్తావించలేదు..

20 ఏళ్లుగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్‌ ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించాలంటూ ప్రతిపాదించిన 9 అంశాల్లో మహిళా బిల్లును సోనియా ఎందుకు ప్రస్తావించలేదన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీర్మానం చేసిందని కవిత గుర్తుచేశారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ దీనిపై మరోసారి తీర్మానం చేసిందని, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్‌ కూడా లేఖ రాశారని చెప్పారు.

First Published:  16 Sept 2023 1:27 AM GMT
Next Story