Telugu Global
Telangana

KCR అంటే కాలువలు(K), చెక్ డ్యామ్ లు(C), రిజర్వాయర్లు(R)

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు కవిత.

KCR అంటే కాలువలు(K), చెక్ డ్యామ్ లు(C), రిజర్వాయర్లు(R)
X

కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌ డ్యాంలు, రిజర్వాయర్లు అని కొత్త అర్థం చెప్పారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టులను నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ లోని న్యూ అంబేద్కర్ భవన్‌ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని అన్నారామె.


ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నిజామాబాద్ కి చెందిన నాయకుడు పనిచేశారని, అప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా నీటిపారుదల రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు కవిత. కాలువలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు.

కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతున్నది నిజామాబాద్ జిల్లాయేనని తెలిపారు కవిత. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం అని చెప్పారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా 1.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటిరంగంపై దృష్టిపెట్టడంతో నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు. పారదర్శక పాలన ఉంది కాబట్టే దశాబ్ది ఉత్సవాల పేరిట 21 రోజులపాటు ప్రతి శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నామని తెలిపారు కవిత.

First Published:  7 Jun 2023 1:49 PM IST
Next Story