Telugu Global
Telangana

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే జాగృతి సంకల్పం

ఆచార్య ఎన్‌ గోపికి.. ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను అందించి సత్కరించారు ఎమ్మెల్సీ క‌విత.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడమే జాగృతి సంకల్పం
X

తెలంగాణ రాష్ట్ర సాధనను మనం ఎంత ముఖ్యంగా భావించామో.. మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యంగా భావించాలన్నారు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. జాగృతి నేతృత్వంలో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోడానికి ఉద్యమం చేశామని గుర్తుచేశారు. హైదరాబాద్ అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో తెలంగాణ సాహిత్య సభలను ఆమె ప్రారంభించారు. ప్రతి ఏడాది సాహిత్య సభలు నిర్వహిస్తామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సాహిత్య సభల్లో అన్ని అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి ఉంటాయన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నామ‌ని గుర్తుచేశారు ఎమ్మెల్సీ కవిత. అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ సాహిత్య సభలు విజయవంతం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎవరి భాష వారికి ఉంటుందని, ఇదే మాట్లాడాలి అని అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తామ‌న్నారు. తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుందని తెలిపారు.

ఆచార్య ఎన్.గోపికి పురస్కారం..

ఆచార్య ఎన్‌ గోపికి.. ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను అందించి సత్కరించారు ఎమ్మెల్సీ క‌విత. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ నందిని సిధారెడ్డి, డాక్ట‌ర్ గోరేటి వెంకన్న, డాక్ట‌ర్ తిరునగరి దేవకీ దేవి, డాక్ట‌ర్ గోగు శ్యామల, డాక్ట‌ర్ ఏనుగు నరసింహా రెడ్డి, పలువురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.

జయశంకర్ కు నివాళి..

జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత. జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆమె ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అనునిత్యం ప్రజలను జాగరూక పరుస్తూ సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ స్పూర్తి ప్రదాత జయశంకర్ అని అన్నారు కవిత.



First Published:  21 Jun 2023 3:01 PM IST
Next Story