Telugu Global
Telangana

సబ్ కా విసాక్ అంటే ఇదేనా..? నిర్మలమ్మకు కవిత కౌంటర్..

2014 నాటికి భారత్ అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడది దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు కవిత. దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రెట్ల అధిక అప్పును మోదీ మోపారని మండిపడ్డారు.

సబ్ కా విసాక్ అంటే ఇదేనా..? నిర్మలమ్మకు కవిత కౌంటర్..
X

కర్నాటక మెట్రోతో పాటు ఉత్తరప్రదేశ్‌ లో చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణపై ఎందుకు వివక్ష ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా? అని నిర్మలా సీతారామన్ ని నిలదీశారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రూ.100 లక్షల కోట్ల అప్పు చేసిన మోదీ ప్రభుత్వం.. తెలంగాణ రుణాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారామె.

2014 నాటికి భారత్ అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడది దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు కవిత. మోదీ హయాంలో కేంద్రం 100 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని వివరణ ఇచ్చారు. దేశంలో ఒక్కో వ్యక్తిపై 3 రెట్ల అధిక అప్పును మోదీ మోపారని మండిపడ్డారు. దేశంలోని అత్యంత ధనవంతులు 3 శాతం మాత్రమే జీడీపీకి తోడ్పడుతున్నారని, మిగతా భాగస్వామ్యం అంతా పేదలది, సామాన్యులదేనన్నారు.

జాబ్ లు అడిగితే జాబ్ కార్డ్ లు తగ్గించారు..

ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఉపాధి హామీకి కూడా బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. దేశంలో 8.5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం.. లేనిపోని సాకులు చెప్పి, ఉపాధి హామీ కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి, పేదల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. పెద్దవాళ్లకు దోచిపెట్టే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు.

కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరినా కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా.. కేంద్రం ఇవ్వడం లేదన్నారు. తలసరి ఆదాయాన్ని ఆర్థిక సర్వేలో వెల్లడించకపోవడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ అప్పులు, మెడికల్ కాలేజీల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కవిత కౌంటర్ ఇచ్చారు.

First Published:  17 Feb 2023 12:38 PM IST
Next Story