Telugu Global
Telangana

వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం

పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో ఎన్నో మార్పులు చూస్తున్నామని చెప్పారు కవిత. నిజామాబాద్ లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా అని ఆశ్చర్యపోయే విధంగా నగరాన్ని మార్చేశామన్నారు.

వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం
X

భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగారు కానీ తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడి అంశాలను ఎప్పుడూ ప్రస్తావించలేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ నేతలు పదేళ్లుగా ఎన్నో అబద్ధాలు చెప్పారని, ఒక్క పని కూడా చేయలేదన్నారు. పైగా తెలంగాణలోని శాంతియుత వాతావరణాన్ని పాడు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు, మన కోసం పార్లమెంట్ లో పెదవి విప్పని నాయకులు, మనకు సాయం చేయలేని నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నించారు కవిత. నిజామాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు.


పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో ఎన్నో మార్పులు చూస్తున్నామని చెప్పారు కవిత. నిజామాబాద్ లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా అని ఆశ్చర్యపోయే విధంగా నగరాన్ని మార్చేశామన్నారు. గతంలో ఆడవాళ్లు బిందెలతో రోడ్లపైకి వస్తే, కేవలం రెండు డ్రమ్ములు నీళ్లు మాత్రమే ఇచ్చేవారన్నారు. ఇప్పుడు అన్ని ఇళ్లకూ కుళాయి నీళ్లు వస్తున్నాయని చెప్పారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటినుంచి మనిషి చనిపోయే వరకు తెలంగాణలో ప్రతి అంశానికి సంబంధించిన పథకాలున్నాయని అన్నారు కవిత. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలోనూ మానవీయ కోణంలో ఆలోచించేది కేసీఆర్ ఒక్కరేనన్నారు.

మిడతల దండు పనిపడతాం..

తమపై దండయాత్రకు వచ్చినట్టు ఢిల్లీ నుంచి వస్తున్న మిడతల దండు పనిపడతామని హెచ్చరించారు కవిత. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.. బుల్డోజర్లు తీసుకొస్తామన్నారని, వెయ్యి బుల్డోజర్లకు తెలంగాణ గడ్డపై కారు ఒక్కటే సమాధానం అని చెప్పారు కవిత. తెలంగాణ ప్రాంతం ఉన్నది బుల్డోజర్లతో వినాశనం చేసేందుకు కాదని.. ఇది ట్రాక్టర్లు వెళ్లే నేల అని, సాగునీటి సదుపాయం దండిగా ఉందని, పిల్లలకు చదువులు, యువతకు ఉద్యోగాలు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు కవిత.

తెలంగాణకు గట్టి పునాది పడిందని, ఇప్పుడు దాన్ని నిర్మించుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు కవిత. బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుందని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందని.. అసలు పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు కవిత. బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ కూడా వాకవుట్ చేసిందని గుర్తు చేశారు. ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారని ప్రశ్నించారు కవిత.

First Published:  27 Nov 2023 6:04 AM GMT
Next Story