Telugu Global
Telangana

ఏం మాట్లాడాలి, ఏంతినాలి అని చెప్పడానికి వాళ్లెవరు..?

ప్రపంచవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయన్నారు కవిత. వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ కు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానన్నారు.

ఏం మాట్లాడాలి, ఏంతినాలి అని చెప్పడానికి వాళ్లెవరు..?
X

మనం ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించేందుకు ఇటీవల కొంతమంది తయారయ్యారని, వారి మాటలు ఎవరూ ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మన మనసుకి నచ్చిందే చేద్దాం, మనసుకి నచ్చిన విధంగా ఉందాం అని ఆమె పిలుపునిచ్చారు. మీడియా స్పియర్ పేరుతో హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ మాస్ కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కవిత ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయన్నారు కవిత. వాటిని తట్టుకుని నిలబడుతున్న ప్రతి జర్నలిస్ట్ కు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఇటీవల భారతదేశంలోని అనేక మందిపై పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించారని, అందులో ఎక్కువ మంది మహిళా జర్నలిస్టులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


పాకిస్తాన్ లాంటి దేశాల్లో మహిళా జర్నలిస్టులు వార్తలు రాసినందుకు ‌కుటుంబ సభ్యులే పరువు హత్యలు చేసిన ‌సందర్భాలు‌న్నాయని చెప్పారు. జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైన వృత్తి కాదని, చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రంగం ద్వారా అనేకమంది ‌మహిళలకు ఉపయోగం కలుగుతుందన్నారు. స్వార్థంతో కాకుండా, సమాజం కోసం చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేసినప్పుడే సవాళ్లను ఎదుర్కోగలమని చెప్పారు. తాను అన్ని రాజకీయ పార్టీల్లోని మహిళా నాయకులతో స్నేహం చేయడానికి ఇష్టపడతానని, మహిళా జర్నలిస్టులు కూడా ప్రపంచంలోని వివిధ రకాల సంస్థలతో సంబంధాలు కలిగి ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

కేసీఆర్ స్కాలర్షిప్..

ఈ ఏడాది నుండి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ లో అర్థికంగా వెనుకబడిన పది మంది విద్యార్థినిలకు భారత్ జాగృతి తరుపున 'కేసీఆర్ స్కాలర్‌షిప్' అందిస్తామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ, భారతదేశం, ఓటు హక్కు అంశాలపై మూడు సినిమాలు రూపొందించాలని విద్యార్థిలను ఎమ్మెల్సీ కవిత కోరారు.

First Published:  24 Jan 2023 7:39 PM IST
Next Story