ఆడబిడ్డకో న్యాయం..అదానికో న్యాయమా ఎమ్మెల్సీ కవిత ట్వీట్
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత షాకింగ్ ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. అఖండ భారతంలో వేర్వేరు న్యాయాలు ఏమిటని ఆమె అభిప్రాయపడ్డారు. అదానీపై అమెరికాలో లంచం ఇవ్వజూపినట్లుగా కేసు నమోదు కావడంతో ఆమె స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తెలంగాణ ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అన్నారు. కానీ ఆధారాలు ఉన్నప్పటికీ అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని కవిత ప్రశ్నించారు. ఎన్ని ఆరోపణలు వచ్చిన ప్రధాని మోదీ అదానీ వైపే ఉన్నారని ఎక్స్ వేదికగా నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలను ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారని, కానీ అదానీపై పదేపదే ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఇంగ్లీష్‌లోనూ ఆమె ట్వీట్ చేశారు. అదానీపై ఎన్డీయే సర్కార్ చర్యలు తీసుకోకుండా ఆపుతోంది ఎవరు? అని కవిత ప్రశ్నించారు.