Telugu Global
Telangana

పట్టించుకోని కాంగ్రెస్.. మల్లన్న ఓటమి ఖాయమేనా..?

రాకేష్ రెడ్డి క్లీన్ ఇమేజ్ తో తీన్మార్ మల్లన్నను పోల్చి చూడలేమంటున్నారు. కాంగ్రెస్ కూడా ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసి బీఆర్ఎస్ విజయాన్ని సునాయాసం చేసింది.

పట్టించుకోని కాంగ్రెస్.. మల్లన్న ఓటమి ఖాయమేనా..?
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెలల వ్యవధిలోనే లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గెలుపు ధీమాతో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే హుషారుతో ప్రచారం చేసింది. కానీ ఆ వెంటనే జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్ని మాత్రం పార్టీ పెద్దలు పట్టించుకోవడంలేదు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి అభ్యర్థిగా బరిలో నిలిచారు, కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న పోటీ పడుతున్నారు. బీజేపీ పోటీ నామమాత్రమేనని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

రాకేష్ రెడ్డి విజయం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థి రాకేష్ రెడ్డిని వెంట బెట్టుకుని సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సింగిల్ ఎమ్మెల్సీ సీటుకోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేటీఆర్. హరీష్ రావు సహా ఇతర నేతలు కూడా రాకేష్ రెడ్డికోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?

తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆ పార్టీ సీనియర్లెవరూ ఆయన తరపున ప్రచారం చేయట్లేదు. కనీసం అభ్యర్థిని పక్కన పెట్టుకుని పట్టభద్రులకోసం వీడియోలు కూడా విడుదల చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, సీనియర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఒకరకంగా అయిష్టంగానే తీన్మార్ మల్లన్నను వారు అభ్యర్థిగా నిలబెట్టారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. అందుకే ఈ ఎన్నికను వారు లైట్ తీసుకున్నారు.

మల్లన్నపై ట్రోలింగ్..

క్యూ న్యూస్ అధినేతగా తీన్మార్ మల్లన్న జర్నలిజం వృత్తిలో ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ గా ఇతర పార్టీల తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఉదాహరణలున్నాయి. అయితే ఆయన అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి.. ఇలా ఆయన కాంగ్రెస్ లో ఏ నాయకుడ్ని కూడా వదిలిపెట్టకుండా తిట్టిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన కాంగ్రెస్ నేతల్ని తిట్టి, ఇప్పుడు అదే కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయనపై ఉన్న కేసులు కూడా ప్రత్యర్థి వర్గానికి ప్రధాన అస్త్రంగా మారాయి. మరోవైపు రాకేష్ రెడ్డి క్లీన్ ఇమేజ్ తో తీన్మార్ మల్లన్నను పోల్చి చూడలేమంటున్నారు. ఒకరకంగా కాంగ్రెస్ కూడా ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసి బీఆర్ఎస్ విజయాన్ని సునాయాసం చేసింది.

First Published:  23 May 2024 6:58 AM IST
Next Story