Telugu Global
Telangana

వాళ్ల టార్గెట్ నలుగురు కాదు నలబై మంది.. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు!

అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది. సిట్ అధికారుల నివేదికను పరిశీలిస్తే వీళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.

వాళ్ల టార్గెట్ నలుగురు కాదు నలబై మంది.. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు!
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన కేసును తెలంగాణ ప్రభుత్వం 'సిట్'కు అప్పగించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారుల విచారణలో ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. హైకోర్టుకు సిట్ అధికారులు మధ్యంతర నివేదికను అందించారు. ఇందులో విచారణ సమయంలో నిందితుల నుంచి రాబట్టిన కీలక విషయాలను పొందుపర్చారు. ముఖ్యంగా కొనుగోలు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ వ్యవహారం కూడా బయటపడింది.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది. సిట్ అధికారుల నివేదికను పరిశీలిస్తే వీళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బేరసారాలు చేశారు. ఆ రోజే సదరు ఎమ్మెల్యేలు పోలీసులకు ఉప్పందించడంతో మొత్తం స్కాం బయటపడింది. కాగా, బీజేపీ ఏజెంట్లు కొనుగోలు చేయాలనుకున్నది నలుగురికి కాదని, వాళ్ల టార్గెట్ 40 మంది అని విచారణలో తేలింది.

ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి, బీఎస్ సంతోశ్ మధ్య చాటింగ్‌లో నలబై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కనపడుతోంది. అంతే కాకుండా 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని.. మరి కొంత మందితో చర్చలు జరుపుతున్నామని ఇద్దరూ సంభాషించుకున్నారు. ఈ వివరాలన్నింటినీ సిట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. 40 మందిని కొనుగోలు చేస్తే ప్రభుత్వం అస్థిరపడుతుందని.. అప్పుడు పూర్తి స్థాయిలో ప్లాన్ చేయవచ్చని కూడా చర్చించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రణాళికలు వేసినట్లు తేలింది.

అప్పటి నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వాట్సప్ చాట్‌లు నడిచాయని సిట్ గుర్తించింది. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులనే వీళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరిని టార్గెట్ చేయాలనే లిస్టును కూడా పేర్లతో సహా వాట్సప్‌లో షేర్ చేసుకున్నారు. కేవలం ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలను కూడా వీళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల్లోని కీలక నాయకులను కూడా బీజేపీలోకి తీసుకొని రావడానికి వీళ్లు ప్రయత్నించినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా వీరి లిస్టులో ఉన్నారు. ఆయనను బీజేపీలోకి తీసుకొని వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పట్టు దొరుకుతుందని వీళ్లు చర్చించుకున్నారు. కాంగ్రెస్‌లోని ఇతర సీనియర్ నాయకులకు కూడా గాలం వేసేందుకు ప్రయత్నం జరిగింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు మధ్య జరిగిన చాటింగ్‌లో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి. వీటన్నింటినీ సిట్ తమ నివేదికలో పొందుపర్చింది. బీఎల్ సంతోశ్‌తో చర్చలు మొదలైన తర్వాత.. వీళ్లు ముగ్గురు కలిసి సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారని.. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నట్లు సిట్ వెల్లడించింది.

సిట్ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగు చూస్తుండటం.. ఆధారాలతో సహా వారిపై అభియోగాలు మోపడంతో బీజేపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నది. కాగా, ఈ కేసులో ముగ్గురు నిందితులకు గురువారమే బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ముగ్గురు హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని, ప్రతీ వారం సిట్ ముందు విచారణకు హాజరు కావాలనే షరతులు హైకోర్టు విధించింది.

First Published:  2 Dec 2022 5:56 AM GMT
Next Story