రాజయ్య ఆశావాదం.. జమిలి ఎన్నికలొస్తాయ్.. టికెట్లు మారతాయంటూ వ్యాఖ్యలు
ఎవరేమనుకున్నా చివరికి తనకే టికెట్ దక్కుతుందని కొన్ని రోజులుగా రాజయ్య పదేపదే చెబుతున్నారు. ఈ రోజు తాజాగా కార్యకర్తలతో మాట్లాడుతూ టికెట్ విషయంలో మనం మొక్కవోని ధైర్యంతో ఉందామని చెప్పుకొచ్చారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ముందుకెళుతున్నారు. ఈ నియోజకవర్గానికి సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్య స్థానంలో సీనియర్ నేత కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. అయితే ఎవరేమనుకున్నా చివరికి తనకే టికెట్ దక్కుతుందని కొన్ని రోజులుగా రాజయ్య పదేపదే చెబుతున్నారు. ఈ రోజు తాజాగా కార్యకర్తలతో మాట్లాడుతూ టికెట్ విషయంలో మనం మొక్కవోని ధైర్యంతో ఉందామని చెప్పుకొచ్చారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తుందని ధీమా
వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వస్తుందని, కాబట్టి ఎన్నికలు రెండు, మూడు నెలలు ఆలస్యమవుతాయని రాజయ్య చెప్పారు. కాబట్టి టికెట్లు మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తనకు అధినాయకత్వం నుంచే సమాచారం ఉందని రాజయ్య వ్యాఖ్యానించడం చూస్తుంటే రాజకీయ పరిణామాలు ఏమైనా మారబోతున్నాయా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జమిలి సాధ్యం కాదంటున్నా ఎక్కడో ఆశ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పట్టుమని 3 నెలలు కూడా లేవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ ఈ డిసెంబర్ పూర్తయ్యేలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాలి. అయితే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమవుతాయన్నట్లు రాజయ్య మాట్లాడారు. కానీ అసలు జమిలి ఎన్నికలకు ఇంకా ఆలు లేదు.. చూలు లేదు. దీనిపై అధ్యయనానికి కేంద్రం కమిటీ వేసినా.. అది నివేదిక ఇవ్వడానికి గడువు కూడా పెట్టలేదు. అదీకాక రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి. విపక్షాలు ఒప్పుకోవాలి. రాజ్యాంగ సవరణలు చేయాలి. ఇవన్నీ ఇప్పట్లో అయ్యే ముచ్చట కాదని తెలిసినా రాజయ్య జమిలి వస్తుందని.. మనకు టికెట్ దక్కొచ్చని ఆశ పడుతున్నారు.
♦