Telugu Global
Telangana

కాంగ్రెస్ కండువా తీసెయ్ కోవర్డ్ రెడ్డీ..! సీతక్క ఆగ్రహం..

కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు సీతక్క. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని నిలదీశారు.

కాంగ్రెస్ కండువా తీసెయ్ కోవర్డ్ రెడ్డీ..! సీతక్క ఆగ్రహం..
X

వారిద్దరూ కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు, కోవర్ట్ రెడ్డి బ్రదర్స్ అంటూ కేటీఆర్ చేసిన విమర్శలతో అప్పట్లో ఎగిరెగిరి పడ్డారు అన్నదమ్ములిద్దరు. కానీ, ఇప్పుడు తెలంగాణ అంతా వారిద్దర్నీ కోవర్ట్ రెడ్డిలేనంటోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ దశలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా స్వరం పెంచారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. కాంగ్రెస్ లో ఉండే అర్హత వెంకట్ రెడ్డికి లేదని అన్నారు ఎమ్మెల్యే సీతక్క.

తమ్ముడి గెలుపే ముఖ్యమైతే బీజేపీలో చేరు..

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుపే ముఖ్యమైతే వెంటనే కాంగ్రెస్ కండువా తీసేసి, బీజేపీలో చేరాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. బంధాలకతీతమే రాజకీయాలని, నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ లో ఉంటూ కుటిల రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

విదేశాల్లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్ రెడ్డిపై సీతక్క నిప్పులు చెరిగారు. వెంకట్‌ రెడ్డి దుర్మార్గుడని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు సీతక్క. కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని నిలదీశారు. పోనీ ప్రచారానికి రాకపోతే సైలెంట్ గా ఉండాలని, కానీ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, కాంగ్రెస్ ఓడిపోతుందంటూ క్యాడర్ ని నిరుత్సాహరపరచడం సరికాదన్నారు సీతక్క.

వెంక‌ట్‌రెడ్డి భవిష్యత్తు ఏంటి..?

ప్రస్తుతానికి ఉప ఎన్నికతో సంబంధం లేదంటూ ఆస్ట్రేలియాలో ఉన్నా.. తిరిగొచ్చాకయినా అధిష్టానానికి వెంక‌ట్‌రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇప్పటి వరకూ స్థానిక నాయకులతోనే ఆయనకు విభేదాలుండేవి, తొలిసారిగా అధిష్టానానికి కూడా ఆయన పగయ్యారు. ఈ దశలో ఆయనకు కాస్తో కూస్తో సపోర్ట్ గా ఉన్న వీహెచ్ వంటి నేతలు కూడా ఇకపై నోరు మెదపకపోవచ్చు. దాదాపుగా కాంగ్రెస్ లో వెంకట్ రెడ్డి ఒంటరిగా మారారనే చెప్పాలి. ఇన్నాళ్లూ అధిష్టానానికి బద్ధుడిని అంటూ చెప్పుకుంటున్న వెంకట్ రెడ్డి, ఇప్పుడు అధిష్టానమే పక్కనపెడితే ఏం చేస్తారో చూడాలి.

First Published:  25 Oct 2022 10:19 AM IST
Next Story