Telugu Global
Telangana

నిన్న పొగిడి.. ఇవ్వాళ కోర్టుకెక్కిన ఎమ్మెల్యే సీతక్క

సీతక్క పిటిషన్‌పై అక్టోబర్ 9న తిరిగి విచారణ జరపుతామని శుక్రవారం కేసును వాయిదా వేసింది.

నిన్న పొగిడి.. ఇవ్వాళ కోర్టుకెక్కిన ఎమ్మెల్యే సీతక్క
X

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను పొగిడి 24 గంటలకు కాకముందే ప్లేటు మార్చారు. ములుగు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు, మల్లంపల్లిని మండలంగా ప్రకటించినందుకు మంత్రులు హరీశ్ రావు, దయాకర్ రావు ఎదుటే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మల్లంపల్లి పేరును జగదీశ్ పేరుతో జేడీ మల్లంపల్లిగా మార్చాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇలా గురువారం నాడు ప్రభుత్వాన్ని పొగిడిన సీతక్క.. శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌లో ఏకంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పలు ఆరోపణలు చేశారు.

ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు (కాన్‌స్టిట్యూయెన్సీ డెవలప్‌మెంట్ ఫండ్స్) విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండటం వల్లే తన నియోజకవర్గానికి నిదులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

సీడీఎఫ్ నిధుల మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. జిల్లా మంత్రి కావాలనే ములుగు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని పరోక్షంగా ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి పిటిషన్‌లో పేర్కొన్నారు. సీడీఎఫ్ నిధుల మంజూరుకు జిల్లా మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని హైకోర్టుకు సీతక్క విజ్ఞప్తి చేశారు.

కాగా, సీతక్క పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంటనే ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీతక్క పిటిషన్‌పై అక్టోబర్ 9న తిరిగి విచారణ జరపుతామని శుక్రవారం కేసును వాయిదా వేసింది.

First Published:  29 Sept 2023 6:55 PM IST
Next Story