Telugu Global
Telangana

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గుజరాత్, యూపీ నుంచి బెదిరింపు కాల్స్.. పోలీసులకు ఫిర్యాదు

కొన్ని రోజులుగా పైలెట్ రోహిత్ రెడ్డి సహా మరో ఎమ్మెల్యేకు అనామక వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో నమోదైన 11 నెంబర్ల నుంచి రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గుజరాత్, యూపీ నుంచి బెదిరింపు కాల్స్.. పోలీసులకు ఫిర్యాదు
X

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతున్నది. నిందితులను సిట్ లోతుగా విచారిస్తున్నది. వాళ్లు చెప్పే ప్రతీ విషయాన్ని నోట్ చేసుకుంటూ.. దీని వెనుక ఉన్న వాళ్లు ఎవరో తేల్చే ప్రయత్నంలో ఉన్నది. అదే సమయంలో కొనుగోళ్ల విషయంలో చాకచక్యంగా వ్యవహరించి, బీజేపీ కుట్రలను బయట పెట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాటు చేసింది. ఆ రోజు ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనతో సహా.. అందుకు ముందు పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన మాటలు, వీడియోలు సీఎం కేసీఆర్ బయటపెట్టారు.

అయితే, కొన్ని రోజులుగా పైలెట్ రోహిత్ రెడ్డి సహా మరో ఎమ్మెల్యేకు అనామక వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో నమోదైన 11 నెంబర్ల నుంచి రోహిత్ రెడ్డికి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో రోహిత్ రెడ్డి తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్ రెడ్డి తనకు ఏయే నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో కూడా పోలీసులకు ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి కూడా అన్‌నోన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఆయనను కూడా బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ రావడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఈ కాల్స్ వెనుక ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.

ఇక సిట్ విచారణలో ముగ్గురు ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆ రోజు, అంతకు ముందు ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందు ఎలా రోహిత్‌ను సంప్రదించారు. ఫామ్‌హౌస్‌లో ఏయే విషయాలు చెప్పారనే విషయాలను సిట్‌కు రోహిత్ తెలిపారు.

First Published:  13 Nov 2022 9:26 AM
Next Story