Telugu Global
Telangana

అప్పుడే మొదలైన జంపింగ్ లు..

ఎమ్మెల్యే రేఖా నాయక్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో భేటీ అవుతారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఆమెకు ఖానాపూర్ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. భార్యకంటే ఒకరోజు ముందే కాంగ్రెస్ లో చేరిన భర్త శ్యాం నాయక్ కూడా హస్తం పార్టీ తరపున అసెంబ్లీ బరిలో దిగుతారని తెలుస్తోంది.

అప్పుడే మొదలైన జంపింగ్ లు..
X

బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా బయటకు రాగానే అసంతృప్తుల్లో అలజడి మొదలైంది. కొంతమంది పార్టీతోనే ఉంటామని ప్రకటించారు, మరికొందరు సైలెంట్ గా ఉన్నారు, ఒకరిద్దరు భవిష్యత్ రాజకీయ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌ లకు బీఆర్ఎస్ టికెట్లు నిరాకరించగా అందులో ఒకరైన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌, బీఆర్ఎస్ ని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారు, ముందుగా ఆమె భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

రెండు ఆఫర్లు..

ఖానాపూర్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీఆర్ఎస్ జాబితాతో నిరాశ చెందారు. ముందునుంచీ ఆమెకు విషయం తెలిసినా అధికారిక ప్రకటన కోసం వేచి చూశారు. ఈరోజు ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో భేటీ అవుతారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఆమెకు ఖానాపూర్ టికెట్ ఖాయమైపోయినట్టు తెలుస్తోంది. ఇక భార్యకంటే ఒకరోజు ముందే కాంగ్రెస్ లో చేరిన భర్త శ్యాం నాయక్ కూడా హస్తం పార్టీ తరపున అసెంబ్లీ బరిలో దిగుతారని తెలుస్తోంది. ఆయన ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు.

పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నల్ల మనోహర్ రెడ్డి కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్లడంలేదు. పెద్దపల్లి నుంచి ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానని ప్రకటించారు. దాసరి మనోహర్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకే మరోసారి ఆ పార్టీ అవకాశమిచ్చింది. దీంతో నల్ల మనోహర్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రుడిగా బరిలో దిగుతానన్నారు.

First Published:  22 Aug 2023 6:35 AM IST
Next Story