టీ కప్పులో తుపాను.. నవ్యతో కలసి రాజయ్య ప్రెస్ మీట్
నవ్య ఆరోపణల తర్వాత రాజయ్య వ్యవహారం సంచలనంగా మారింది. అయితే ఈ వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పడింది. రాజయ్య, నవ్య కుటుంబాన్ని కలవడం, సారీ చెప్పడంతో ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసిపోయిందనే చెప్పాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై అదే పార్టీకి చెందిన మహిళా సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇటీవల సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై నవ్య బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేయడంతో మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. అయితే ఇప్పుడీ వ్యవహారం టీ కప్పులో తుపానులాగా తేలిపోయింది. ఆరోపణలు చేసిన సదరు సర్పంచ్ తో కలసి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యవహారానికి ముగింపు పలికారు, క్షమాపణలు చెప్పారు.
చింతిస్తున్నా..
తనపై వచ్చిన ఆరోపణలకు చింతిస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే రాజయ్య. అధిష్టానం సూచన మేరకు, నవ్య భర్త ప్రవీణ్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ప్రవీణ్, నవ్య దంపతులతో ముందు ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తనకు ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానన్నారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. నవ్య సర్పంచిగా ఉన్న జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు, ఆ గ్రామానికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
వేధింపులు సరికాదు..
రాజయ్య పక్కన ఉండగానే మరోసారి ఆరోపణలు చేశారు నవ్య. అయితే నేరుగా ఆయన్ను టార్గెట్ చేయలేదు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండకూడదన్నారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకైనా తాను సిద్ధం అని హెచ్చరించారు. పార్టీలో తప్పులు జరిగితే ఖండిస్తూనే ఉంటానన్నారు. చివరగా తాను ఎమ్మెల్యే రాజయ్య వల్లే సర్పంచిని కాగలిగాను అను ముక్తాయించారు నవ్య.
ఐయాం సారీ..
నవ్య ఆరోపణల తర్వాత రాజయ్య వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పై విమర్శలు మొదలయ్యాయి. అయితే ఈ వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పడింది. రాజయ్య, నవ్య కుటుంబాన్ని కలవడం, సారీ చెప్పడంతో ఇక్కడితో ఈ వ్యవహారం ముగిసిపోయిందనే చెప్పాలి.