రాజశ్యామల యాగం.. రాజయ్యకు వర్కవుట్ అవుతుందా?
శత్రు బాధలు తొలగిపోయి, తనకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే రాజయ్య నమ్ముతున్నారు. మరి రాజశ్యామల యాగం ఆయనకు రాజయోగం పట్టిస్తుందేమో వేచి చూడాల్సిందే.
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఎప్పుడూ ఏదో వివాదంతో కలకలం రేపే రాజయ్య ఈ సారి రాజశ్యామల యాగం చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో తనకు బీఆర్ఎస్ టికెట్ దక్కదని ఓ నిర్ణయానికి వచ్చేసిన రాజయ్య తనకు టికెట్ దక్కి, గెలుపొందాలంటూ ఈ యాగం చేస్తున్నారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఈ సారి టికెట్ డౌటే
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యకు తెలంగాణ తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఏడాది తిరగకుండానే అవినీతి ఆరోపణలతో కేసీఆర్ ఆగ్రహానికి గురై పదవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో పెద్దగా హవా చెలాయించలేకపోయినా 2018 ఎన్నికల్లో మళ్లీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇటీవల నవ్య అనే మహిళా సర్పంచ్‌తో అనుచిత ప్రవర్తనతో రాజయ్య ప్రతిష్ఠ మరింత దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి టికెట్ డౌటే అని అంటున్నారు .
కడియం శ్రీహరికేనా?
మరోవైపు తెదేపా నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన సీనియర్ నేత, ఎప్పటి నుంచో రాజయ్యకు రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరి పార్టీలో పాతుకుపోయారు. ఈ సారి ఆయనకే టికెట్ అని బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజయ్య రాజశ్యామల యాగం చేస్తున్నారు. శత్రు బాధలు తొలగిపోయి, తనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. మరి రాజశ్యామల యాగం రాజయ్యకు రాజయోగం పట్టిస్తుందేమో వేచి చూడాల్సిందే.