Telugu Global
Telangana

అదీ లెక్క.. అలాగే ఉండండి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రేవంత్ అలా మారకూడదని సూచించారు.

అదీ లెక్క.. అలాగే ఉండండి
X

ప్రధాని మోదీ తెలంగాణకు పెద్దన్నలా ఉండాలంటూ వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి సెటైర్లు పడుతుంటే, బీజేపీ నుంచి మాత్రం ప్రశంసలు భిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గత సీఎం కేసీఆర్ లా మారొద్దని ఆయనకు సూచించారు రాజాసింగ్. మొదట్లో కేసీఆర్ కూడా ఇలాగే మోదీని పొగిడారని, ఆ తర్వాత ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ కూడా పాటించలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి అలా మారకూడదని సూచించారు రాజాసింగ్.

బీజేపీ హయాంలో..

కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయనేది రేవంత్ రెడ్డి లెక్కలు తీయాలని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించారో సరిచూడాలని చెప్పారు రాజాసింగ్. తెలంగాణలో అభివృద్ధి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఏమీ రాలేదని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారని, ఆ నిధులన్నీ వారు వాడుకున్నారని ఆరోపించారు. గత పదేళ్ళలో మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని అభ్యర్థించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తెలంగాణకు ఎన్ని నిధులు కావాలన్నా.. ఇచ్చేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు రాజాసింగ్.

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరికి వారే తప్పుగా అన్వయించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు వివరణలు ఇచ్చుకోవడం ఇక్కడ కొసమెరుపు. పెద్దన్నలా కేంద్రం రాష్ట్రాలకు సాయం చేయాలని మాత్రమే ఆయన చెప్పారని అంత మాత్రాన మోదీ తెలంగాణకు పెద్దన్న అయిపోయారనుకోవద్దని అంటున్నారు.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే..?

"కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. ఎన్టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తుంది. కంటోన్మెంట్‌ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. రాష్ట్రానికి పెద్దన్నలా మోదీ సహకారం అందించాలి." అని ఆదిలాబాద్ సభలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  4 March 2024 2:24 PM GMT
Next Story