Telugu Global
Telangana

బొమ్మల రామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు

బండి సంజయ్‌ అరెస్టు విషయం తెలుసుకొని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మల రామారం చేరుకున్నారు.

బొమ్మల రామారం పీఎస్ వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు
X

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టెన్త్ క్లాస్ పేపర్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలతో మంగళవారం అర్థరాత్రి ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్ అరెస్టు వార్త తెలుసుకొని భారీ ఎత్తున బీజేపీ నాయకులు, అభిమానులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కాగా.. బండి సంజయ్‌ అరెస్టు విషయం తెలుసుకొని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బొమ్మల రామారం చేరుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో తన వాహనం దిగి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. బండి సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటే పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అక్కడ పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన పోలీసులు రఘునందన్ రావును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.

శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ముందస్తుగా అరెస్టు చేస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావుకు పోలీసులు చెప్పారు. దీనిపై మండిపడిన రఘునందన్ రావు.. ఏసీపీ ఇక్కడకు రావాలని డిమాండ్ చేశారు. ఆయనను వాహనంలోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వ్యతిరేకించారు. చివరకు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఆయనను స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బండి సంజయ్‌ను ఈ రోజు భువనగిరి కోర్టులో హాజరు పరచనున్నారు.

బండి సంజయ్‌పై పోలీసులు సీఆర్‌పీసీ 151 సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. ఏదైనా నేరం జరుగకుండా ముందస్తుగా నిరోధించడానికి ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. దీని సాయంతో ప్రివెన్షన్ డిటెన్షన్ చేయవచ్చు. కాగా, పోలీసులు సెక్షన్ తోనే పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టుపై ఈ రోజు హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా బండి సంజయ్‌ను అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగనున్నది.

First Published:  5 April 2023 9:40 AM IST
Next Story