Telugu Global
Telangana

బీజేపీలో ముసలం పుట్టించిన రఘునందన్ రావు.. నడ్డా, అమిత్ షా, బండి సంజయ్‌పై ఆరోపణలు

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించే వార్తలు నిజమే అని చెప్పారు. తాను కూడా అధ్యక్ష పదవికి అర్హుడినే అని అన్నారు.

బీజేపీలో ముసలం పుట్టించిన రఘునందన్ రావు.. నడ్డా, అమిత్ షా, బండి సంజయ్‌పై ఆరోపణలు
X

తెలంగాణ బీజేపీలో మరో ముసలం పుట్టింది. ఈ రోజు సాయంత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని వార్తలు వస్తున్న సమయంలో.. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని.. తాను బీజేపీ అధ్యక్ష పదవికి సరిపోనా అని అన్నారు. అంతే కాకుండా.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాపై పలు ఆరోపణలు చేశారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రఘునందన్ రావు.. అక్కడ మీడియాతో చిట్ చాట్ చేశారు.

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించే వార్తలు నిజమే అని చెప్పారు. తాను కూడా అధ్యక్ష పదవికి అర్హుడినే అని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీలో పదవులకు నా కులమే అడ్డుగా ఉన్నట్లు కనపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో అమిత్ షా వచ్చి ప్రచారం చేయకపోయినా.. తాను గెలిచానని గుర్తు చేశారు. రెండో సారి కూడా తాను దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని రఘునందన్ రావు ధీమాగా చెప్పారు.

మునుగోడులో రూ.100 కోట్లు పెట్టినా గెలవలేదు. అదే రూ.100 కోట్లు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినని రఘునందన్ రావు అన్నారు. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు ఓటేశారని.. బీజేపీని చూసి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కంటే ముందు దుబ్బాకలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.

బండి సంజయ్ తనంతట తానుగా ఇంత వరకు తెచ్చుకున్నారు. భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్‌కి వందల కోట్ల రూపాయలు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ఆరోపించారు. పార్టీ డబ్బు అంటే అందరికీ వాటా ఉంటుంది. తరుణ్ చుగ్, సునిల్ బన్సల్ బొమ్మలు కాదు.. ఈటల, రఘునందన్ బొమ్మలతోనే ఓట్లు వస్తాయని అన్నారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే. ఇక్కడ ప్రజలు మమ్మల్ని చూసే ఓట్లేశారని కుండ బద్దలు కొట్టారు.

పార్టీకి శాసన సభా పక్ష నేత లేడనే విషయం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా తెలియదు. ఆ విషయం నడ్డాకు చెబితే ఆశ్చర్యపోయారు. తాను 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాను. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై మోడీకి ఫిర్యాదు చేస్తానని రఘునందర్ రావు హెచ్చరించారు. తాను గెలిచినందునే ఈటల పార్టీలోకి వచ్చారని రఘునందర్ చెప్పారు.

First Published:  3 July 2023 6:17 PM IST
Next Story