సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
మొన్నటివరకు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపించినప్పటికీ ఆయన మౌనం వహించారు. దీంతో పద్మారావు గౌడ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు.
లోక్‌సభ ఎన్నికలకు మరో అభ్యర్థిని ప్రకటించారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ పేరును ఫైనల్ చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ స్థానం ప్రకటనతో మొత్తం 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇంకా హైదరాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే ఈ సీట్లపై కూడా క్లారిటీ రానుంది.
మొన్నటివరకు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపించినప్పటికీ ఆయన మౌనం వహించారు. దీంతో పద్మారావు గౌడ్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. పద్మారావు గౌడ్ స్థానిక నేత కావడంతో పాటు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. 2002లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన పద్మారావు గౌడ్.. 2004లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగానూ వ్యవహరించారు. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా, అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ ప్రజలు, బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందారు.