Telugu Global
Telangana

తగ్గేది లేదన్న మైనంపల్లి.. కేసీఆర్ దే తుది నిర్ణయం

హైదరాబాద్ వచ్చాక మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాల్లో తన అనుచరులతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మైనంపల్లి హన్మంతరావు. తాను ఏ పార్టీనీ విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానన్నారు.

తగ్గేది లేదన్న మైనంపల్లి.. కేసీఆర్ దే తుది నిర్ణయం
X

"నేనెవర్నీ ఇబ్బంది పెట్టను, నన్ను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను.." అంటూ మరోసారి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. సీఎం కేసీఆర్ పై కానీ, బీఆర్ఎస్ పార్టీపై కానీ తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి ఎంత దూరమైనా వెళ్తానన్నారు మైనంపల్లి.

రెండంటే రెండే..

మల్కాజ్ గిరిలో తనకు, మెదక్ లో తన కొడుకు రోహిత్ కి బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వాలని, లేకపోతే తామిద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని నిన్న తిరుమలలో మైనంపల్లి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన మంత్రి హరీష్ రావుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు మరోసారి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న మైనంపల్లి టికెట్ల కేటాయింపుపై స్పందించారు. తనకు మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినందుకు సంతోషం అని, అయితే తన కొడుక్కి కూడా మెదక్ టికెట్ కావాలన్నారు. తన కొడుకు వైద్య వృత్తిని వదిలిపెట్టి మరీ సామాజిక సేవ చేస్తున్నారని, ఆయనకు తన సపోర్ట్ అవసరం అన్నారు. కొడుకు తర్వాతే తనకు ఎవరైనా అని చెప్పారు.

హైదరాబాద్ వచ్చాక కార్యాచరణ..

హైదరాబాద్ వచ్చాక మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాల్లో తన అనుచరులతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు మైనంపల్లి హన్మంతరావు. తాను ఏ పార్టీనీ విమర్శించనని, పార్టీలకు అతీతంగా ఉంటానన్నారు.

కేసీఆర్ నిర్ణయం ఏంటి..?

తనతోపాటు తన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. అయితే మెదక్ సీటు ఆల్రడీ పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించారు సీఎం కేసీఆర్. ఈ దశలో అసలు మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ ఉంటుందా.. లేదా..? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే హరీష్ రావుపై మైనంపల్లి విమర్శలను మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఖండించారు. మెదక్ లో మైనంపల్లి దిష్టిబొమ్మల్ని కొందరు నాయకులు తగలబెట్టారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు మళ్లీ సంచలనం కాగా.. మైనంపల్లి వ్యవహారంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

*

First Published:  22 Aug 2023 12:34 PM IST
Next Story