సీఎం దృష్టికి తీసుకెళ్తా.. స్పందించిన హరీష్ రావు
మదన్ రెడ్డి అనుచరుల ఆందోళన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు మంత్రి హరీష్ రావు. కార్యకర్తలు, అభిమానులు శాంతంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తొలి జాబితాలో ఉన్న స్థానాల విషయంలో అక్కడక్కడా అసంతృప్తి బయటపడిన విషయం తెలిసిందే. అయితే జాబితాలో లేని నాలుగు స్థానాల్లో కూడా అలజడి మొదలైంది. ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ రాదేమోనని అనుచరులు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చేందుకే ఫస్ట్ లిస్ట్ లో నర్సాపూర్ కి చోటు దక్కలేదనే అనుమానం వారిలో ఉంది. దీంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి హరీష్ రావుతో తమ బాధ చెప్పుకున్నారు. మదన్ రెడ్డికి టికెట్ ఇప్పించాల్సిందేనని పట్టుబట్టారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
మదన్ రెడ్డి అనుచరుల ఆందోళన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు మంత్రి హరీష్ రావు. కార్యకర్తలు, అభిమానులు శాంతంగా ఉండాలని సూచించారు. ఆవేశ పడొద్దని, అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఎవరికి ఎలా న్యాయం చేయాలో సీఎం కేసీఆర్ కి తెలుసని, ఎవరూ ప్రలోభాలకు గురి కావొద్దన్నారు. ఉద్వేగానికి లోనుకాకుండా శాంతంగా ఉండాలని మదన్ రెడ్డి అనుచరులకు పిలుపునిచ్చారు హరీష్ రావు.
మదన్ రెడ్డి అనుచరుల అనుమానం నిజమేనా..?
నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆ స్థానం నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దింపాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయం ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్ మరింత సమయం తీసుకున్నారు. అందుకే తొలి జాబితాలో నర్సాపూర్ పేరు లేదు. దీంతో మదన్ రెడ్డి అనుచరులు మరింత టెన్షన్ పడుతున్నారు. అటు సునీతా లక్ష్మారెడ్డి వర్గంలో కూడా సీటు వస్తుందా రాదా అనే అనుమానం పెరిగిపోతోంది. ఈ దశలో మంత్రి హరీష్ రావు ఇంటి ముందు మదన్ రెడ్డి అనుచరులు, బంధువులు పంచాయితీ పెట్టారు. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారిని సముదాయించిన మంత్రి హరీష్ రావు, విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు.