ఎమ్మెల్యే లాస్య నందిత మరణం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతురు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల కారు డ్రైవర్లకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాల మేరకు, వారి సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు.
ఈ మధ్యకాలంలో అనుభవం లేని డ్రైవర్ల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న వీఐపీల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లకు ఫిట్‌నెస్ టెస్టులపై ప్రకటన చేశారు రవాణామంత్రి పొన్నం ప్రభాకర్. యువ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వీఐపీలందరికీ వారి డ్రైవర్లను పరీక్షకు పంపాలని లేఖలు పంపుతామని తెలిపారు. పరీక్ష తరువాత వారి రిపోర్టును అందజేస్తామన్నారు. సుదూర ప్రయాణాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లనే నియమించుకోవాలని పొన్నం సూచించారు.
ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి.. తల్లి, అక్కతోపాటు ఆమె కూతురు నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. లాస్య తల్లి స్టేట్‌మెంట్ ఏమిచ్చిందంటే.. "నేను, నా కూతురు లాస్య నందిత, మనవరాలుతో కలిసి గురువారం రాత్రి కారులో సదాశివపేట మండలం ఆరూర్ సమీపంలోని మిస్కన్‌షాబాబా దర్గాకు వెళ్లాం. దర్గాలో ప్రార్థనల అనంతరం ఆరూర్ నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చాక టిఫిన్ కోసం లాస్య కారులో డ్రైవర్ ఆకాశ్‌తో కలిసి సంగారెడ్డి వైపు వెళ్లింది. ఈ క్రమంలో ORRపై ప్రమాదం జరిగి లాస్య చనిపోయింది" అని తెలిపింది. మియాపూర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే డ్రైవర్, పీఏ ఆకాశ్ కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. యాక్సిడెంట్ ఎలా అయిందో అర్థం కావట్లేదని అతను తెలిపాడు.