గవర్నర్ ప్రసంగం వినడానికి సిగ్గుపడుతున్నా..
పదేళ్లు విధ్వంసం జరిగిందని గవర్నర్ ప్రసంగంలో అన్నారని, మరి 55 ఏళ్లు జరిగిన జీవన విధ్వంసం గురించి మాట్లాడొద్దా అని ప్రశ్నించారు కేటీఆర్. సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు.. వారి అసమర్థత గురించి చెబితే ఉలిక్కిపడటమేంటని అన్నారు.
"ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసం చేయనని
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించనని.."
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఇలాగే ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అక్కడున్నా, ఇక్కడున్నా తాము ఎప్పుడూ ప్రజా పక్షమేనని చెప్పారాయన. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు తమపై తప్పులు నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని అసెంబ్లీలో విమర్శించారు కేటీఆర్.
ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పడావుపడ్డ భూములు, పాడుబడ్డ ఇళ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్ కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకట్లు, నెత్తురుబారిన నేలలు.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో తాగునీరు, సాగునీటికి దిక్కు లేదని అన్నారు. నల్గొండకు ఫ్లోరోసిస్ తప్ప వీరు ఏమిచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్ ప్రసంగాన్ని మధ్యలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు. గతం గురించి చెప్పొద్దని, గతం బాగోలేదనే కదా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. పొన్నంకు వెంటనే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పొన్నంకి తొలిసారి మంత్రి పదవి వచ్చిన ఉత్సాహం ఉందని సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ పాలనలో 50ఎకరాల రైతు కూడా గుంపు మేస్త్రీగా పనిచేసే దుస్థితి ఉందని అన్నారు కేటీఆర్.
పదేళ్లు విధ్వంసం జరిగిందని గవర్నర్ ప్రసంగంలో అన్నారని, మరి 55 ఏళ్లు జరిగిన జీవన విధ్వంసం గురించి మాట్లాడొద్దా అని ప్రశ్నించారు కేటీఆర్. సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంటు ఇవ్వలేని అసమర్థులు.. వారి అసమర్థత గురించి చెబితే ఉలిక్కిపడటమేంటని అన్నారు. మొదటి రోజే ఇంతలా భయపడతారెందుకు..? ఉలిక్కిపడతారెందుకు..? అని ప్రశ్నించారు కేటీఆర్. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు చెబితే మా మాటలు ఇలా ఉండేవి కాదన్నారు. కొత్త ప్రభుత్వానికి మూడు నెలలు సమయం ఇద్దామని తమ నాయకుడు తమకి సూచించారని గుర్తు చేశారు. కానీ గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత అలాంటి పరిస్థితి లేదన్నారు. గతంలో పదవులకోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు కేటీఆర్.