Telugu Global
Telangana

క్లారిటీతోనే ఉన్నా.. భట్టి బుజ్జగింపులకు లొంగని రాజగోపాల్ రెడ్డి..

చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని.. సినిమా డైలాగులకు ఓట్లు రావని సెటైర్లు వేశారు రాజగోపాల్ రెడ్డి.

క్లారిటీతోనే ఉన్నా.. భట్టి బుజ్జగింపులకు లొంగని రాజగోపాల్ రెడ్డి..
X

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ హాట్ గా సాగుతోంది. కాంగ్రెస్ లో ఉంటూ తెలంగాణలో బీజేపీదే భవిష్యత్ అంటారాయన. నేను పార్టీ మారే వార్తలు టీఆర్ఎస్ సృష్టి అని కూడా చెబుతారు. ఇలా పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ దశలో ఆయన్ని బుజ్జగించేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే భట్టి బుజ్జగింపులకు రాజగోపాల్ లొంగినట్టు కనిపించడంలేదు. బీజేపీలోకి వెళ్తున్నానని ప్రకటించకుండానే.. కాంగ్రెస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఒరిజినల్ కాంగ్రెస్ లేదు..

ఇటీవల ఒరిజినల్ కాంగ్రెస్, వలసల కాంగ్రెస్ అంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు చెప్పిన మాటల్నే రాజగోపాల్ రెడ్డి కూడా వల్లెవేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు కాంగ్రెస్‌లో ప్రయారిటీ లేదని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని అన్నారు. చప్పట్లు వచ్చినంత ఈజీగా ఓట్లు రాలవని.. సినిమా డైలాగులకు ఓట్లు రావని సెటైర్లు వేశారు రాజగోపాల్ రెడ్డి.

భట్టి మంచోడు, అధిష్టానమే..

భట్టి విక్రమార్క తనకు అన్న లాంటి వ్యక్తి అని, తనతో ప్రత్యేకంగా మాట్లేందుకు వచ్చారని అన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్‌ కు తానెక్కడ దూరం అవుతానేమోనన్న ఆవేదనతో భట్టి వచ్చారని చెప్పారు. గతంలో తాను సీఎల్పీ కోరానని, అయితే భట్టి మంచి నాయకుడు, ఓపిక, వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, సీఎల్పీ ఆయనకే ఇవ్వండని సిఫార్సు కూడా చేశానని అన్నారు. 12మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా అధిష్టానం లైట్ తీసుకుందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెంటనే మారుస్తారని అనుకున్నా అధిష్టానం ఆలస్యం చేసిందని చెప్పారు. తాను కన్ఫ్యూజన్లో లేనని, క్లారిటీతోనే ఉన్నానని అంటున్న రాజగోపాల్ రెడ్డి.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, టీఆర్ఎస్‌ ని ఆ పార్టీయే ఓడించగలదని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

తాను మునుగోడుకు ఒక్కసారి వెళ్లినా.. మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి వందసార్లు వెళ్లినా ఒక్కటే అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నియోజక వర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా, కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేందుకు మాత్రం మంత్రి మునుగోడుకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల గురించి సీఎం దగ్గర మాట్లాడలేని దద్దమ్మ అని జగదీశ్వర్ రెడ్డిపై మండిపడ్డారు. మొత్తమ్మీద మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు క్లారిటీ ఉందని చెబుతున్నారు కానీ, జనాలకు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు.

First Published:  25 July 2022 2:47 PM GMT
Next Story