Telugu Global
Telangana

ఈ ఎన్నికలకు దూరం.. పై ఎన్నికలకు సిద్ధం

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పిన జగ్గారెడ్డి, టికెట్ తన కార్యకర్తలకే ఇప్పిస్తానన్నారు. అంతలోనే ఆయన మళ్లీ క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డిలో కార్యకర్తలెవరూ పోటీకి సిద్ధపడకపోతే తన సతీమణి నిర్మలని నిలబెడతానన్నారు.

ఈ ఎన్నికలకు దూరం.. పై ఎన్నికలకు సిద్ధం
X

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో నియోజకవర్గంలో కలకలం రేపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయడానికి సిద్ధం లేనని చెప్పి షాకిచ్చారు. అయితే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదు. కేవలం పంట విరామం లాగా ఎన్నికల విరామం ప్రకటించారంతే. తిరిగి 2028లో మాత్రం తానే సంగారెడ్డి నుంచి పోటీ చేస్తానంటూ కుండబద్దలు కొట్టారు. అసలు జగ్గారెడ్డి ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి..? ఆయన ఎన్నికల విరామం ఎందుకు ప్రకటించారు..? అసలేమైంది..?

కార్యకర్తలకే నా సీటు..

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పిన జగ్గారెడ్డి, టికెట్ తన కార్యకర్తలకే ఇప్పిస్తానన్నారు. అంతలోనే ఆయన మళ్లీ క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డిలో కార్యకర్తలెవరూ పోటీకి సిద్ధపడకపోతే తన సతీమణి నిర్మలని కాంగ్రెస్ టికెట్‌పై నిలబెడతానన్నారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య విష్ణువర్దన్ రెడ్డి విందు రాజకీయాలకు కూడా జగ్గారెడ్డి హాజరయ్యారు. స్వపక్షంలో విపక్షంలా ఉంటున్నా కూడా తాను పార్టీలోనే ఉంటానని చెబుతుంటారు జగ్గారెడ్డి, ఆయన కోపమంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనే. రేవంత్ రెడ్డి వైరి వర్గమే జగ్గారెడ్డికి పార్టీలో మిత్రులు.

జగ్గారెడ్డి గతంలో కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆయన మాటల్ని అంత సీరియస్‌గా పట్టించుకోనక్కర్లేదని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఉన్నట్టుండి మునుగోడు ఉప ఎన్నిక ముందు 2023 ఎన్నికల్లో పోటీ వ్యవహారంపై జగ్గారెడ్డి ఎందుకు స్పందించారనేదే ఆశ్చర్యంగా ఉంది. ఒకరకంగా జగ్గారెడ్డి తన రాజకీయ వారసురాలిగా భార్య పేరుని ఇలా ప్రకటించారనే విషయం స్పష్టమైంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ టికెట్ కావాలా అంటే వద్దనే కార్యకర్తలు ఉంటారా..? అలా వద్దంటే తన భార్యకి టికెట్ ఇప్పిస్తాననడంలో జగ్గారెడ్డి వ్యాఖ్యల అంతరార్థమేంటో ఆయనకే తెలియాలి.

First Published:  7 Sept 2022 5:33 PM IST
Next Story