అది నాకో గుణపాఠం.. సీఎం రేవంత్ పై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదని అంటున్నారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ఎన్నికలకు ముందు ఓ దశలో జగ్గారెడ్డి కూడా తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పారు. అనూహ్యంగా ఆయన ఓడిపోవడంతో ఆ ప్రస్తావన అక్కడితో ఆగిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి, పార్టీగాలి వీచినప్పుడు మాత్రం సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. అయితే ఈ ఓటమి తనకో గుణపాఠం అంటున్నారాయన. సంగారెడ్డినుంచి 5 సార్లు పోటీ చేస్తే మూడుసార్లు తనను ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఈసారి మాత్రం తాను ఓడిపోయానన్నారు.
రేవంత్ పై కీలక వ్యాఖ్యలు..
గతంలో రేవంత్ వ్యతిరేక వర్గంగా జగ్గారెడ్డి పేరుతెచ్చుకున్నారు. తాము అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులమని, వలస నాయకులం కాదని చాలాసార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నానంటు పదే పదే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడేవారు. ఢిల్లీ వెళ్లి కూడా ఫిర్యాదులకు ప్రయత్నించిన సందర్భాలున్నాయి. చివరకు రాహుల్ గాంధీ సర్దిచెప్పడంతో ఆయన ఎన్నికల వేళ సైలెంట్ గా ఉన్నారు. అలాంటి జగ్గారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిపై పూర్తిగా తన స్వరం మార్చారు. రాబోయే ఐదేళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.
జగ్గారెడ్డి వేదాంతం..
బలవంతుడు ఏదో ఒకరోజు బలహీనుడు కాకతప్పదని అంటున్నారు జగ్గారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో సంగారెడ్డిలో ఓడిపోవడం తనకో గుణపాఠం అంటున్నారు జగ్గా రెడ్డి. మొత్తమ్మీద ఆయన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పడమే ఇక్కడ కొసమెరుపు. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనలో పరివర్తన మొదలైనట్టుంది. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వమే శరణ్యమని అర్థమైనట్టు తెలుస్తోంది.