Telugu Global
Telangana

తప్పంతా మీడియాదే, కోమటిరెడ్డిది కాదు..!!

కోమటిరెడ్డి చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి అన్నారు జగ్గారెడ్డి. ప్రజలకు అది ఇంకోలా అర్థమైందని వివరణ ఇచ్చారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదన్నారు.

తప్పంతా మీడియాదే, కోమటిరెడ్డిది కాదు..!!
X

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యల కలకలం అంతా ఇంతా కాదు. తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి రాలేనని కాంగ్రెస్ డిసైడ్ అయిందా, బీఆర్ఎస్ పొత్తు కోసం అర్రులు చాస్తుందా అనే విధంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఖండించారు. తీరా నోరుజారి నాలిక కరుచుకున్నట్టుగా ఆ నెపాన్ని కోమటిరెడ్డి మీడియాపైనే వేసేశారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారన్నారు. తాజాగా ఎమ్మెల్యే కూడా తప్పంతా మీడియాదేనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలతో హడావిడి పడిపోయి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత, ఇప్పుడు పార్టీ నష్టనివారణ చర్యలు తీసుకుంటోంది. కోమటిరెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా అసలా వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు నేతలు.

తెలంగాణలో కాంగ్రెస్ కి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ ఇన్ చార్జ్ మాణిక్‌ రావు ఠాక్రేని కలసిన ఆయన.. బీజేపీ, బీఆర్ఎస్ ను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై తాము చర్చలు జరిపామన్నారు. రాష్ట్రంలో 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తామని చెప్పారు జగ్గారెడ్డి. కోమటిరెడ్డి చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి అన్నారు. ప్రజలకు అది ఇంకోలా అర్థమైందని వివరణ ఇచ్చారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్‌కు నష్టం జరగదన్నారు. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదని సర్దిచెప్పారు జగ్గారెడ్డి. అయితే రేవంత్ వర్గం మాత్రం కోమటిరెడ్డి వ్యాఖ్యలపై గరంగరంగా ఉంది.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు ఉత్తమ్, భట్టి , కోమటిరెడ్డి పాదయాత్రలు చేస్తారని, తాను కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తానన్నారు. కాంగ్రెస్‌ లో అందరూ కలిసే ఉన్నారని, నాయకుల మధ్య అభిప్రాయ బేధాలే తప్ప విభేదాలు లేవని చెప్పారు.

First Published:  16 Feb 2023 5:01 PM IST
Next Story