Telugu Global
Telangana

తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన?

మాజీ మంత్రి హరీశ్‌ రావు.. చర్లపల్లి జైలులో పట్నం నరేందర్‌ రెడ్డి ములాఖత్‌

తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన?
X

తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ లో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డితో గురువారం ఆయన ములాఖత్‌ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సోకాల్డ్‌ ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలయ్యిందన్నారు. అక్కడి ప్రజలు తమ భూముల కోసం కొన్ని నెలలుగా పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎందుకు వారిని పిలిచి మాట్లాడటం లేదన్నారు. గూండాలు, పోలీసులతో ఎందుకు బెదిరింపులకు దిగుతున్నారని నిలదీశారు. ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టి కొట్టారని, లగచర్ల రైతులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్‌ రెడ్డి తన బాధ్యత నిర్వర్తించారే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు లగచర్ల ఘటనపై అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా అది బీఆర్‌ఎస్‌ కుట్రేనని చెప్తున్నారని అన్నారు. అశోక్‌ నగర్‌ లో విద్యార్థులు, రైతులు, పోలీసుల కుటుంబాలు, గురుకుల విద్యార్థుల ఆందోళనలన్నీ బీఆర్‌ఎస్‌ కుట్రేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడకుండా రేవంత్‌ రెడ్డి అక్రమాలు, నేరాలకు చిడుతలు వాయిస్తూ చెక్కభజన చేయాలా అని ప్రశ్నించారు.

ఉద్యమాలు, అరెస్టులు బీఆర్‌ఎస్‌ కు కొత్త కాదన్నారు. తననో, కేటీఆర్‌నో, ఎమ్మెల్యేలనో అరెస్టు చేసుకోండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టు చేయొద్దన్నారు. ప్రభుత్వం ఎన్నిరకాలుగా వేధించినా తమ పోరాటం ఆపబోమన్నారు. మల్లన్నసాగర్‌ లో రోజులు నిరాహార దీక్ష చేస్తే రక్షణ కల్పించామే తప్ప అడ్డుకోలేదు, అరెస్ట్‌ చేయలేదన్నారు. శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, కార్తీక్‌ రెడ్డి లగచర్లకు పోతే రాకుండా అడ్డుకున్నారని, స్థానిక ఎంపీ డీకే అరుణను కూడా రానివ్వడం లేదన్నారు. నరేందర్‌ రెడ్డి, కేటీఆర్‌ పై అక్రమ కేసులు పెట్టగలరే తప్ప ఇంకా ఏమి చేయలేరన్నారు. ప్రజలు రేవంత్‌ ను గద్దె దించడాన్ని మర్చిపోరని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌ సమీపంలో ఫార్మాసిటీ కోసం కేసీఆర్‌ 14 వేల ఎకరాల భూమి సేకరించి సిద్ధంగా ఉంచారని తెలిపారు. పచ్చటి పొలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రేవంత్‌ చిచ్చు పెడుతున్నాడని అన్నారు. ఆనాటి ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కొడంగల్‌, జహీరాబాద్‌ లో భూ సేకరణ బంద్‌ పెట్టి హైదరాబాద్‌ లోని భూముల్లో ఫార్మాసిటీ పెట్టాలన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్‌ పై కుట్ర చేస్తున్నారని అన్నారు. రేవంత్‌ రెడ్డి, కోదండరామ్‌, దామోదర రాజనర్సింహ ప్రజలను రెచ్చగొట్టినా ఆనాడు వారిపై కేసులు పెట్టలేదన్నారు. రిమాండ్‌ రిపోర్టులో ఏం రాశారో తెలియదని నరేందర్‌ రెడ్డి తనతో చెప్పారని అన్నారు. చదవకుండానే దానిపై తనతో సంతకం చేయించారని మెజిస్ట్రేట్‌ ముందు చెప్పానని తనతో అన్నాడని తెలిపారు. కేటీఆర్‌ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్‌ కు తన అల్లుడు, బడా ఫార్మా కంపెనీలపై తప్ప రైతులు, గిరిజనులపై ప్రేమ లేదన్నారు. నరేందర్‌ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, నాయకులు కార్తీక్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

First Published:  14 Nov 2024 2:33 PM IST
Next Story