Telugu Global
Telangana

చంపినంత పనిచేశారు -ఎమ్మెల్యే గువ్వల

అచ్చంపేట ప్రజల దీవెనలు తనకి ఉన్నాయని, అందుకే బతికానని చెప్పుకొచ్చారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాలకోసం పనిచేస్తానని చెప్పారు బాలరాజు.

చంపినంత పనిచేశారు -ఎమ్మెల్యే గువ్వల
X

తనపై దాడి చేసింది కాంగ్రెస్ గూండాలేనని అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులను చంపినంత పనిచేశారని చెప్పారు. రాయితో తనపై కూడా దాడి చేశారన్నారు. తన అదృష్టం బాగుండి బతికి బయటపడ్డానన్నారు. అచ్చంపేట ప్రజల దీవెనలు తనకి ఉన్నాయని, అందుకే బతికానని చెప్పుకొచ్చారు. వంశీకృష్ణ గతంలో కూడా తన ఆఫీస్ పై దాడి చేశారన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, కేసీఆర్, కేటీఆర్ ఆశయాలకోసం పనిచేస్తానని చెప్పారు బాలరాజు. దాడి అనంతరం ఆయనకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కోలుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

అచ్చంపేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య శనివారం రాత్రి ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్‌ నేతలు కారులో డబ్బు తరలిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు వెంబడించారు. కారుపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. ఇటీవల దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కూడా దాడి జరిగింది. కత్తిపోట్లతో కొత్త ప్రభాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు ఆపరేషన్ కూడా జరిగింది. అంబులెన్స్ లో వచ్చి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన విషయం కూడా తెలిసిందే. బాలరాజుకి ఆ స్థాయిలో దెబ్బలు తగల్లేదు కానీ, ప్రత్యర్థులు తన అనుచరుల్ని చంపినంత పనిచేశారని ఆయన ఆరోపించారు.

దాడి తర్వాత ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే బాలరాజును మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు పరామర్శించారు. దాడి వివరాలు, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నేతలే తన భర్తపై దాడి చేశారని అన్నారు గువ్వల అమల. గతంలో తనపై కూడా వారు అసభ్యంగా కామెంట్లు చేశారని, ఇప్పుడు ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

First Published:  12 Nov 2023 5:53 PM IST
Next Story