Telugu Global
Telangana

కేటీఆర్ కార్యక్రమానికి దూరం.. ఉప్పల్ ఎమ్మెల్యేపై పెరుగుతున్న అనుమానం

ఈ రోజు మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి కూడా రాలేదంటే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కి దూరమవుతున్నట్టుగా సంకేతాలు పంపినట్టే లెక్క.

కేటీఆర్ కార్యక్రమానికి దూరం.. ఉప్పల్ ఎమ్మెల్యేపై పెరుగుతున్న అనుమానం
X

బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగుల్లో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఒకరు. ఈ నియోజకవర్గం నుంచి బండారి లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారు. దీంతో సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే అలకబూనారు. అయితే ఎక్కడా బయటపడలేదు, పార్టీని తూలనాడలేదు. కానీ తన అసంతృప్తిని వివిధ సందర్భాల్లో బయటపెడూతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సరిగా హాజరు కావడంలేదు, తాజాగా మూసీ బ్రిడ్జ్ శంకుస్థాపన కోసం ఉప్పల్ భగాయత్ లో మంత్రి కేటీర్ పాల్గొన్న కార్యక్రమానికి ఎమ్మెల్యే భేతి గైర్హాజరయ్యారు. ఆహ్వాన కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పేరుమీదుగానే జరుగగా.. చివరకు ఆయనే రాకపోవడం విశేషం. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని అంటున్నారు స్థానిక నేతలు.

కాంగ్రెస్ వైపు భేతి చూపు..!

ఉప్పల్ లో తనకు టికెట్ రాకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే భేతి, కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మంతనాలు జరిగాయని, కానీ ధైర్యం చేసి ఆయన బయటపెట్టడం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ చేరికపై ఎమ్మెల్యే ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు, కనీసం బీఆర్ఎస్ కి దూరమవుతానని కూడా చెప్పలేదు. కానీ ఈ రోజు మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి కూడా రాలేదంటే భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కి దూరమవుతున్నట్టుగా సంకేతాలు పంపినట్టే లెక్క.

కొన్నిరోజులుగా బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే భేతి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిష్టానం కూడా వారిద్దర్నీ పిలిపించి మాట్లాడే అవకాశాలున్నాయి. ఈలోగా భేతి, పార్టీకి దూరంగా ఓ అడుగు వేశారు. ఆయన్ను పిలిచి బుజ్జగిస్తారా లేక, లైట్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద ఎమ్మెల్యే భేతి వ్యవహారం ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది.


First Published:  25 Sept 2023 5:27 PM IST
Next Story