కొడంగల్, హుజూర్‌నగర్‌కు ఏమైంది.. పాతబస్తే ఎందుకు?
పాతబస్తీ వాళ్లను కరెంట్ దొంగలనడం కరెక్ట్ కాదన్నారు అక్బరుద్దీన్. పాతబస్తీ వాళ్లు ఎలాంటి దొంగతనం చేయరని ప్రభుత్వంపై మండిపడ్డారు.
పాతబస్తీలో బకాయిపడ్డ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించడంపై MIM పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు ఎంచుకున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టొచ్చు కదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నియోజకవర్గాల్లో పెట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. పాతబస్తీ వాళ్లను కరెంట్ దొంగలనడం కరెక్ట్ కాదన్నారు అక్బరుద్దీన్. పాతబస్తీ వాళ్లు ఎలాంటి దొంగతనం చేయరని ప్రభుత్వంపై మండిపడ్డారు. పాతబస్తీకి సరైన పవర్ సప్లయ్ చేయకుండా ప్రభుత్వాలే అలసత్వం ప్రదర్శిస్తున్నాయంటూ ఎదురుదాడికి దిగారు. తన దగ్గర ఆధారాలున్నాయని దీనిపై చర్చకైనా సిద్ధమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు అక్బరుద్దీన్ ఓవైసీ.
అదానీకి ఇవ్వడానికి పైలెట్ ప్రాజెక్టు కింద పాతబస్తీనే ఎందుకు సెలెక్ట్ చేశారు?
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2024
కొడంగల్‌లో పైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టొచ్చు కదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా శ్రీదర్ బాబు నియోజకవర్గాల్లో పెట్టొచ్చు కదా? - అక్బరుద్దీన్ ఓవైసీ pic.twitter.com/YGH9kXxYOo
తెలంగాణలో కరెంటు బిల్లు వసూలు బాధ్యతను అదానీ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంలో ఉంది రేవంత్ సర్కార్. పైలట్ ప్రాజెక్టుగా పాతబస్తీలో విద్యుత్ బకాయిలు వసూలు చేసే బాధ్యతను అదానీ గ్రూప్‌కు అప్పగించింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు సరిగ్గా జరగడం లేదని, బకాయిల వసూలుకు వెళ్తే విద్యుత్ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. అందుకే అదానీ సంస్థకి ఈ బాధ్యతను అప్పగించామని ప్రభుత్వం చెబుతోంది. తర్వాత క్రమంగా ఈ విధానాన్ని హైదరాబాద్, అనంతరం రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. వసూలు చేసిన బకాయిల్లో 75 శాతం ప్రభుత్వానికి, 25 శాతం అదానీ సంస్థకు వెళ్తుంది. ప్రభుత్వ విధానంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజా ప్రయోజనాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం సరికాదంటున్నారు నిపుణులు.