Telugu Global
Telangana

రాజకీయ నేత కారణంగా ఫ్లైట్ మిస్సయ్యా..కేటీఆర్‌కు స‌మ‌స్య‌ను వివ‌రిస్తూ శ్రీరామచంద్ర ట్వీట్

శ్రీరామచంద్ర సహా మొత్తం 15 మంది ఫ్లైట్ మిస్ అయ్యారు. దీనిపై శ్రీరామచంద్ర అసహనం వ్యక్తం చేశాడు. తాముపడ్డ ఇబ్బందిని వీడియో ద్వారా వివ‌రిస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.

రాజకీయ నేత కారణంగా ఫ్లైట్ మిస్సయ్యా..కేటీఆర్‌కు స‌మ‌స్య‌ను  వివ‌రిస్తూ శ్రీరామచంద్ర ట్వీట్
X

ఒక రాజకీయ నాయకుడు విమానాశ్రయం చేరుకునేందుకు కోసం ఫ్లై ఓవర్ ను బ్లాక్ చేశారని, దానివల్ల సమయానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకోలేక విమానాన్ని మిస్ చేసుకున్నాన‌ని ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఒకసారి దీని గురించి ఆలోచించాల‌ని, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. సింగర్ శ్రీరామచంద్ర గోవాలో జరగాల్సిన ఒక ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరాడు. విమానాశ్రయానికి వెళ్లే ఫ్లైఓవర్ వద్దకు రాగానే అది బ్లాక్‌చేసి ఉంది. దీంతో శ్రీరామచంద్ర, అతడి బృందం మరో మార్గంలో విమానాశ్రయానికి బయలుదేరారు.

ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయి సమయానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకోలేకపోయారు. దీంతో శ్రీరామచంద్ర బృందం ప్రయాణించాల్సిన విమానం అప్పటికే బయలుదేరి వెళ్ళింది. శ్రీరామచంద్ర సహా మొత్తం 15 మంది ఫ్లైట్ మిస్ అయ్యారు. దీనిపై శ్రీరామచంద్ర అసహనం వ్యక్తం చేశాడు. తాముపడ్డ ఇబ్బందిని వీడియో ద్వారా వివ‌రిస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.


'ఒక రాజకీయ నాయకుడి కోసం ఫ్లై ఓవర్ ని బ్లాక్ చేశారు. దీనివల్ల మేము ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయాం. నాతో సహా మొత్తం 15 మంది విమానం ఎక్కలేకపోయాం. ఇప్పుడు మరొక విమానంలో గోవా చేరుకోవడం కష్టమైన పని. రాజకీయ నాయకుల కోసం ఫ్లై ఓవర్లు బ్లాక్ చేయడం వల్ల నాలాంటి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దీని గురించి ఆలోచించండి. ఇది నా రిక్వెస్ట్' అంటూ శ్రీరామచంద్ర ఒక వీడియోని ట్వీట్ చేసి మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. మామూలుగా ట్విట్టర్ వేదికగా అందే సమస్యలను తక్షణం పరిష్కరిస్తుంటారని కేటీఆర్ కు పేరుంది. మరి శ్రీరామచంద్ర చేసిన విజ్ఞప్తిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

కాగా, శ్రీరామచంద్ర చేసిన ట్వీట్ కి సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి మద్దతు అందుతోంది. రాజకీయ నాయకుల కోసం ఇలా రోడ్లు, ఫ్లైఓవర్లు బ్లాక్ చేయడం వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ అనుభవాలను వివరిస్తున్నారు. మనదేశంలో ఇలాంటివి మామూలేనని అనుభవించక తప్పదని మరి కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

First Published:  31 Jan 2023 9:05 PM IST
Next Story