Telugu Global
Telangana

సిరి చందన పట్టు.. సుగంధ పరిమళాలు వెదజల్లేట్టు..

రంగు రంగుల చీరలే కాదు, రకరకాల సువాసనలు వెదజల్లే చీరను తయారు చేశారు. 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను నేశారు.

సిరి చందన పట్టు.. సుగంధ పరిమళాలు వెదజల్లేట్టు..
X

ఇప్పటి వరకూ సప్త వర్ణాల చీరలనే మనం చూశాం. రంగు రంగుల చీరలను నేసే నేతన్నల ప్రతిభ విన్నాం. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే చేనేత కళాకారుడు అంతకు మించి తన ప్రతిభకు మెరుగులద్దారు. రంగు రంగుల చీరలే కాదు, రకరకాల సువాసనలు వెదజల్లే చీరను తయారు చేశారు. 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను నేశారు. ఆ నేతన్న ప్రతిభను గుర్తించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. తమ చేతుల మీదుగా ఆ చీరను ఆవిష్కరించారు, ఆయనను అభినందించారు. ఆయన కోరిక మేరకు తామే ఆ చీరకు ఓ పేరు పెట్టారు. సిరిచందన పట్టుగా నామకరణం చేశారు.

సిరిసిల్ల నేతన్నల ప్రతిభ..

సిరిసిల్ల సాయినగర్ కి చెందిన చేనేత కార్మికులు నల్ల విజయ్ గతంలో కూడా చాలా ప్రయోగాలు చేశారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను తయారు చేశారు. ఉంగరంలో, దబ్బనంలో దూరేంత అతి పలుచటి చీరలను తయారు చేసి తన ప్రతిభ నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ చీర సైజులపై చేసిన ప్రయోగాన్ని, ఇప్పుడు చీర సువాసనపై చేశారు. 27రకాల సుగంధ ద్రవ్యాలను మేళవించి ఈ పట్టుచీర తయారు చేశారు. సెంటుకొడితే బట్టలకు వాసన అంటుకుంటుంది. కానీ ఉతికేసిన తర్వాత అది పోతుంది. కానీ ఈ పట్టుచీరను ఎన్నిసార్లు ఉతికినా, ఎన్నిరోజులు వాడినా దాని సుగంధం పోదు. అదే దీని ప్రత్యేకత.

ఈ సందర్భంగా చేనేత కార్మికుడు నల్ల విజయ్ ని మంత్రులిద్దరూ అభినందించారు. గతంలో మూడు కొంగుల చీర, కుట్టు లేకుండా లాల్చీపైజామా, కుట్టులేని జాతీయ జెండాలను కూడా విజయ్ తయారు చేసినట్టు తెలుసుకుని ఆయన ప్రతిభను మెచ్చుకున్నారు. సిరిసిల్ల పేరుకి ప్రపంచ ఖ్యాతి తేవాలని సూచించారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని చెప్పారు. కానీ కేంద్రం మాత్రం చేనేత కార్మికులకు జీఎస్టీతో షాకిచ్చింది. నేతకోసం ఉపయోగించే నూలుపై జీఎస్టీ విధించడం ద్వారా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆదరణ చూపితే అద్భుతాలు చేయగలిగే నేతన్నలకు కేంద్రం జీఎస్టీతో ఇబ్బంది పెడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కళాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తోంది.

First Published:  8 Oct 2022 10:21 AM GMT
Next Story