అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మంత్రులు.. వారంలోగా పనులు పూర్తి
సాధ్యమైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని.. వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున, సాగర తీరాన, కొత్త సచివాలయానికి కూత వేటు దూరంలో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. ఈ భారీ విగ్రహం దేశానికే తలమానికంగా నిలుస్తుందని మంత్రులు చెప్పారు. ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దానికి సంబంధించిన నిర్మాణ పనులపై ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు టి. హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
సాధ్యమైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని.. వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహంతో పాటు నిర్మాణంలో ఉన్న రాక్ గార్డెన్, ల్యాండ్ సేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటెన్, సాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకునే మెట్ల దారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులను మంత్రులు పరిశీలించారు.
దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంగా నిలవనున్న ఇది.. తెలంగాణకే తలమానికంగా నిలుస్తుందని చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజునే విగ్రహాన్ని ఆవిష్కరించనుండటం సంతోషంగా ఉందని చెప్పారు. పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. కాగా, ఈ విగ్రహం కోసం 791 టన్నుల స్టీల్, 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారనున్నది. ఇప్పటికే హుస్సేన్‌సాగర్ మధ్యలో బుద్ద విగ్రహం, ఒక ఒడ్డున ఎత్తైన జాతీయ జెండా ఉన్నాయి. కొన్ని రోజుల్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు అమరవీరుల జ్యోతి కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా అధికారులు, వర్క్ ఏజెన్సీతో సమావేశమై పనుల పురోగతిపై మంత్రులు చర్చించారు. మరో వారం రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకుసాగాలన్నారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న విగ్రహం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని వారు తెలిపారు. pic.twitter.com/c6ju38koVw
— BRS Party (@BRSparty) March 31, 2023