Telugu Global
Telangana

నీళ్లు పంపింగ్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుంది -ఉత్తమ్

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండ్రోజుల్లో పంపింగ్‌ ప్రారంభించి, మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

నీళ్లు పంపింగ్ చేస్తే భద్రాచలం కొట్టుకుపోతుంది -ఉత్తమ్
X

మేడిగడ్డ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్-2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నామని, ఆ తర్వాత పంప్ లను ఆన్ చేసి నీటిని తామే విడుదల చేస్తామని కేటీఆర్ అల్టిమేట్టం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ఆరోపణలకు బదులిచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి సామర్థ్యంతో నీటిని పంపింగ్‌ చేయాలని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అలా చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారాయన. ఏదైనా ప్రమాదం జరిగితే మేడిగడ్డ సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు. భద్రాచలం కూడా పూర్తిగా కొట్టుకుపోతుందని హెచ్చరించారు. ఉత్తమ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భద్రాచలం కొట్టుకుపోవడమేంటని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.


మేడిగడ్డ కుంగినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్లను కిందకు వదిలిందని, ఇప్పుడు నీళ్లు పంపింగ్‌ చేయాలని తమపై ఒత్తిడి తెస్తోందని అన్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుల సందర్శన పేరుతో బీఆర్ఎస్ నేతలు విహార యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెంచి నిధుల్ని దారి మళ్లించారని కూడా ఉత్తమ్ ఆరోపించారు.

అంత అవసరం లేదు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు విడుదల చేస్తే పంటలు పండుతాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వెంటనే నీటిని పంపింగ్ చేసి సాగునీటి పారుదలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ వాదనతో కాంగ్రెస్ నేతలు ఏకీభవించడం విశేషం. అయితే కాళేశ్వరం ద్వారా నీరు విడుదల చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. దాదాపు రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద కేవలం 93 వేల ఎకరాలు మాత్రమే కొత్తగా సాగులోకి వచ్చిందని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండ్రోజుల్లో పంపింగ్‌ ప్రారంభించి, మిడ్‌ మానేరుకు నీటిని తరలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

First Published:  26 July 2024 12:58 PM GMT
Next Story