Telugu Global
Telangana

మేడిగడ్డ కాంట్రాక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమావేశం..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో L&T గ్రూప్ డైరెక్టర్ ఎస్.వి.దేశాయ్, పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం కాస్త వాడివేడిగా జరిగినట్టు సమాచారం.

మేడిగడ్డ కాంట్రాక్టర్లతో మంత్రి ఉత్తమ్ సమావేశం..
X

మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం తెలంగాణలో ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. పిల్లర్ కుంగిన ఘటన సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడటంతో అప్పటి ప్రతిపక్షాలకు అది ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమగ్ర విచారణకు ఆదేశిస్తామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. అయితే విచారణకు ముందే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజీ పనులు చేసిన L&T ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం కావడం విశేషం. ఈరోజు సచివాలయంలో ఈ సమావేశం జరిగింది.

నాసిరకంగా పనులు చేస్తారా..?

మేడిగడ్డ బ్యారేజ్ పనులు నాసిరకంగా జరిగాయని, అందుకే పిల్లర్ కుంగిపోయిందని కాంగ్రెస్ మొదటినుంచీ ఆరోపిస్తోంది. ఈరోజు L&T ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో నాసిరకంగా పనులెలా చేస్తారని నిలదీశారాయన. నాణ్యత లేకుండా పనులు జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగిన తర్వాత ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి.

సమగ్ర నివేదిక ఇవ్వండి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో L&T గ్రూప్ డైరెక్టర్ ఎస్.వి.దేశాయ్, పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం కాస్త వాడివేడిగా జరిగినట్టు సమాచారం. ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కుంగిపోడానికి కారణమైన వారెవ్వరినీ వదిలిపెట్టబోమని మంత్రి హెచ్చరించారు. పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదే సమయంలో అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని అధికారులకు సూచించారు. తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

First Published:  18 Dec 2023 3:17 PM IST
Next Story