Telugu Global
Telangana

కేసీఆర్ ఎంట్రీతో కాంగ్రెస్ లో కలవరం.. బయటకొస్తున్న మంత్రులు

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 24 గంటల పవర్ పాలసీని తాము కొనసాగిస్తున్నామని చెప్పారాయన.

కేసీఆర్ ఎంట్రీతో కాంగ్రెస్ లో కలవరం.. బయటకొస్తున్న మంత్రులు
X

కేసీఆర్ ప్రజల్లోకి రావడంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకొనేందుకు కేసీఆర్ పొలంబాట పట్టడంతో కాంగ్రెస్ మంత్రులు వరుసగా మీడియా ముందుకొస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని, రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని అన్నారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మార్చారని విమర్శించారు. విద్యుత్‌ విషయంలో ఆ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం కూడా అబద్ధమేనని అన్నారు ఉత్తమ్.

వీఆర్ఎస్ ఖాయం..

బీఆర్ఎస్ పార్టీపై తనకున్న అక్కసుని కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఖాయమని చెప్పారు. ఆ పార్టీలో నేతలెవరూ ఉండరని, లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని జోస్యం చెప్పారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పార్టీలో ఉంటారన్నారు ఉత్తమ్. ప్రాంతీయ పార్టీలేవీ ఇంత త్వరగా కుప్పకూలిన ఉదాహరణలు లేవని, తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని ఆయన అన్నారు.

తెంలగాణలో విద్యుత్ కోతల్లేవ్..

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 24 గంటల పవర్ పాలసీని తాము కొనసాగిస్తున్నామని చెప్పారాయన. కేసీఆర్ ప్రెస్ మీట్ సమయంలో వారు జనరేటర్ వాడారని, వైరింగ్ సమస్య వల్ల కాసేపు అంతరాయం ఏర్పడితే కరెంటు పోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు ఉత్తమ్.

First Published:  1 April 2024 2:51 PM IST
Next Story