Telugu Global
Telangana

తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల

2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు మంత్రి తుమ్మల.

తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల
X

రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి ఫలించినట్టయింది. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీపై చిన్న హింట్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేశారు. రూ.2లక్షల లోపు ఉన్న రుణాల మాఫీపై విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ఆర్‌బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని చెప్పారు తుమ్మల.

గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆరోపించారు మంత్రి తుమ్మల. అయినా కూడా తాము రైతుల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,819 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. 92.68శాతం మందికి రైతుబంధు లబ్ధి చేకూరిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఏడాది కూడా 3 నెలల కంటే తక్కువ రోజుల్లో రైతు బంధు జమ కాలేదని అన్నారు తుమ్మల. కానీ తాము మూడో నెల లోపే నిధులు జమ చేశామని చెప్పారు.

అధికారంలో ఉన్నపుడు ఏనాడూ పంట పొలాలు సందర్శించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు మంత్రి తుమ్మల. అందుకే వారు పొలాల్లోకి వెళ్తున్నారని, రైతులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థుతులను వారు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే బీఆర్ఎస్ ఒత్తిడితో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ముందడుగు వేయడం విశేషం.

First Published:  29 March 2024 2:45 PM GMT
Next Story