Telugu Global
Telangana

వానాకాలం నుంచే రైతుభరోసా.. 5 ఎకరాల లోపు వారికే..?

రైతుబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి యథాతథంగా అమలు చేశామన్నారు. కానీ, రైతుభరోసాలో మార్పులు చేస్తామన్నారు. ఎన్ని ఎకరాల వారికి వర్తింపజేయాలనే దానిపై మంత్రి మండలి నిర్ణయిస్తుందన్నారు.

వానాకాలం నుంచే రైతుభరోసా.. 5 ఎకరాల లోపు వారికే..?
X

రైతు భరోసా అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే నాటికి రైతుబంధు అమల్లో ఉందని.. ఇప్పటివరకూ ఆ స్కీమ్‌ కొనసాగించామన్నారు. రాబోయే వానాకాలం సీజన్ నుంచి రైతుభరోసా స్కీమ్‌ అమలు చేస్తామన్నారు. వాస్తవంగా పంట వేసుకున్న వారికే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. జూన్‌లో ఎన్నికల కోడ్ ముగియగానే.. ఆల్‌ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతిపక్షాలతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చిస్తామన్నారు.

గత ప్రభుత్వం ఆరేళ్లలో రైతు బంధు కింద రూ. 80 వేల 450 కోట్లు ఖర్చు చేసిందని.. అందులో 25 వేల కోట్లు పంట వేయని వారికి అందిందన్నారు తుమ్మల. రైతుభరోసా కేవలం 5 ఎకరాల లోపు వారికే ఇవ్వాలన్న సూచనలు వస్తున్నాయన్నారు. రైతుబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి యథాతథంగా అమలు చేశామన్నారు. కానీ, రైతుభరోసాలో మార్పులు చేస్తామన్నారు. ఎన్ని ఎకరాల వారికి వర్తింపజేయాలనే దానిపై మంత్రి మండలి నిర్ణయిస్తుందన్నారు. పరిమితి విధిస్తే భారీగా భూమలున్న వారికి రైతుభరోసా సాయం రాదన్నారు తుమ్మల.

కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామన్న అంశంపైనా వివరణ ఇచ్చారు తుమ్మల. రాష్ట్రంలో భవిష్యత్‌లో సన్నరకం బియ్య ఉత్పత్తి చేసి.. రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం సన్నాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సన్నాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉందని.. అందుకే రైతులు సాగుకు వెనుకాడుతున్నారని చెప్పారు. సన్నవడ్ల దిగుబడి కూడా తక్కువగా ఉంటుందన్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందన్న కారణంతో రైతులు ఎక్కువగా దొడ్డు వడ్లనే సాగు చేస్తున్నారని చెప్పారు. ప్రాథమికంగా సన్నవడ్లకు బోనస్ ప్రకటించామని.. అవసరాన్ని బట్టి దొడ్డు వడ్లకు వర్తింపజేస్తామన్నారు.

First Published:  26 May 2024 9:23 AM IST
Next Story