Telugu Global
Telangana

నంది అవార్డులపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..

అవార్డుల విషయంలో కొందరు మీడియా ముందు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు మంత్రి తలసాని. ఎవరు పడితే వారు అడిగితే అవార్డులిచ్చేస్తారా అని ప్రశ్నించారు.

నంది అవార్డులపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..
X

ఇటీవల నంది అవార్డులపై నిర్మాతలు అశ్వనీదత్, ఆదిశేషగిరిరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అశ్వనీదత్ కి పోసాని కృష్ణమురళి ఇచ్చిన కౌంటర్ కూడా వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నంది అవార్డుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి అవార్డులు ఇస్తామని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డుల విషయంలో ఆలస్యం జరిగినమాట వాస్తవమేనన్నారు మంత్రి తలసాని. అయితే ఎవరుపడితే వారు మీడియా ముందు మాట్లాడటం సరికాదని, సంబంధిత శాఖ దృష్టికి సమస్య తీసుకు రావాలని చురకలంటించారు. మీడియాని చూస్తే అత్యుత్సాహంతో కొంతమందికి మాటలు వచ్చేస్తాయని అన్నారు. అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంత మేలు చేయాలో అంతా చేసిందని వివరించారు మంత్రి తలసాని. ప్రతి విషయంలోనూ సినీ ఇండస్ట్రీకి అండగా ఉన్నామని చెప్పారు. అయితే అవార్డుల విషయంలో కొందరు మీడియా ముందు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. ఎవరు పడితే వారు అడిగితే అవార్డులిచ్చేస్తారా అని ప్రశ్నించారు. తెలుగు సినిమా పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని చెప్పారు. వచ్చే ఏడాదినుంచి అవార్డులు ఇస్తామని చెప్పారు మంత్రి తలసాని.

First Published:  4 May 2023 11:38 AM GMT
Next Story