Telugu Global
Telangana

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు..

ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు మంత్రి తలసాని. లబ్దిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే అన్ని వసతులు సమకూర్చిందన్నారు.

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు..
X

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటూ.. ఆ రెండూ కష్టసాధ్యమైన పనులు అని మన పెద్దవారు చెబుతుంటారని.. కానీ తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో ఆ రెండూ చాలా సులభం అయిపోయాయని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఓవైపు ఉచితంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తూ.. మరో వైపు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలతో వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని వివరించారు. అంటే తెలంగాణలో పేదలకు ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం.. ఇక ఎంతమాత్రం కష్టం కాదని చెప్పారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్‌ పల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని లబ్ధిదారులకు అందజేశారు.


ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు మంత్రి తలసాని. లబ్దిదారులపై ఒక్క పైసా భారం పడకుండా ప్రభుత్వమే అన్ని వసతులు సమకూర్చిందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందిస్తూ.. ఉచితంగా ఇల్లు కూడా అందిస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇళ్లు నిర్మించి ఇచ్చినా అవి నాసిరకంగా ఉండేవని, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అత్యంత నాణ్యతతో నిర్మించామని చెప్పారు తలసాని.

రేపు మనమే వస్తాం..

జీహెచ్ఎంసీ పరిధిలో 109 ప్రాంతాలలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు మంత్రి తలసాని. 73 ప్రాంతాలలో 69,532 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో 36 ప్రాంతాలలో 30,468 ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పుడైనా, ఎన్నికల తర్వాతయినా ఆ ఇళ్లను తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగమంత కుటుంబం తనది అనుకునే మనస్తత్వం సీఎం కేసీఆర్ ది అని అన్నారు మంత్రి తలసాని.

First Published:  2 Sept 2023 7:00 PM IST
Next Story