మోదీకి ఓటమి భయం.. అందుకే జమిలి జపం
తెలంగాణలో ఉంది కేసీఆర్ సర్కారు అని, దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ తమదని అన్నారు.
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఏ ఒక్క చోటా బీజేపీ గెలిచే అవకాశం లేదని, అందుకే ఆ పార్టీ జమిలి ఎన్నికల జపం చేస్తోందని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జమిలి ఎన్నికలంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. సర్వేలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో మోదీ భయపడి ఈ ప్రతిపాదన మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. ఓటమి నుంచి తప్పించుకోడానికి మోదీ వేసిన కొత్త ఎత్తుగడ ఇది అని చెప్పారు.
తగ్గేదే లేదు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ
తెలంగాణలో ఉంది కేసీఆర్ సర్కారు అని, దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు మంత్రి తలసాని. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ తమదని అన్నారు. ఏ ఎన్నికలైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని, రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. మోదీ క్రేజ్ దేశంలో పడిపోయిందని, బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు వాళ్లవద్ద ఉన్నాయని తెలిపారు మంత్రి తలసాని.
కేంద్రంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు మంత్రి తలసాని. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోందని, దానికి కారణం వారి ఓటమి భయమేనని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఎన్నికలు విడివిడిగా జరిగితే ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. అందుకే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వినపడుతున్నాయి. అయితే జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అంత సులభం కాదని తెలుస్తోంది. జాతీయ పార్టీలు ఒప్పుకున్నా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అసెంబ్లీల ఆమోదం కష్టసాధ్యమేనని చెప్పాలి.
♦