బయో ఏషియా-2025 సదస్సు లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు లోగోను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సచివాలయంలో ఆవిష్కరించారు.
తెలంగాణలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా-2025 సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 25-26 తేదీల్లో బయోఏషియా 22వ ఎడిషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు.
గ్లోబల్ హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణల ద్వారా రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆకాంక్షించారు. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్, అడ్వాన్స్‌డ్ థెరప్యూటిక్స్ వంటి టెక్నాలజీలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని వెల్లడించారు. కృత్రిమ మేథ, డేటా అనలిటిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ వంటి ఆధునిక పరిజ్ఞానాల ద్వారా వస్తున్న అవకాశాలను రాష్ట్రం ఏవిధంగా అందిపుచ్చుకోవచ్చో నిపుణులు సూచిస్తారని ఆయన వివరించారు.