కేసీఆర్‌కు సీతక్క నోటీసులు.. ఎందుకంటే?
జూన్ 24న బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు సీతక్క తరఫు న్యాయవాది కృష్ణకుమార్ తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు పంపించారు మంత్రి సీతక్క. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేర నష్ట పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని సీతక్క ఆరోపించారు.
ఇందిరమ్మ రాజ్యంలో.. ఇసుకాసుర రాజ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి, సీతక్కతో పాటు పలువురు మంత్రులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 24న బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు సీతక్క తరఫు న్యాయవాది కృష్ణకుమార్ తెలిపారు.
కేసీఆర్‌కు పరువు నష్టం నోటీసులు పంపిన మంత్రి సీతక్క
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2024
మంత్రి సీతక్కకు చెందిన పీఏ సుజీత్ రెడ్డి .. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ ఫోటో ఉన్న లారీల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాడని, మీడియా వర్గాల్లో ప్రసారం చేయడంపై కేసీఆర్‌కు నోటీసులు పంపిన మంత్రి సీతక్క. pic.twitter.com/bU0S8O5jjb
సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో సీఎం, కేబినెట్ మంత్రులు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లుగా చూపడాన్ని సీతక్క తప్పుపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని సీతక్క తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్ తెలిపారు.
ఫిబ్రవరిలో భద్రాచలంలోని సారపాక సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తూ 17 లారీలు పట్టుబడ్డాయి. లారీలపై సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ ఉండడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఇసుక రవాణా వెనుక సీతక్కతో పాటు మరో ఖమ్మం మంత్రి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత సీజ్ చేసిన లారీలు పోలీస్ స్టేషన్ నుంచి మాయం కావడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. తర్వాత సీతక్క తన పీఏను కూడా తొలగించారని వార్తలు వచ్చాయి.