Telugu Global
Telangana

వైఎస్ షర్మిల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరిక

రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. అసలు రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని ఆమె గుర్తు పెట్టుకోవాలని మంత్రి సత్యవతి అన్నారు.

వైఎస్ షర్మిల నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరిక
X

తెలంగాణ సీఎం కేసీఆర్, ఉద్యమకారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే ఇకపై సహించేది లేదని, తన పాదయాత్రలో వైఎస్ షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల అంటున్నారు. అసలు రాజన్న రాజ్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం జరిగిందని ఆమె గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ తిరుగుతూ, అందరిపై విమర్శలు చేస్తారని షర్మిలను మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అండదండలతోనే వైఎస్ఆర్ సీఎం అయ్యారు. ఆయన సీఎం కాబట్టే మీరు ఇవ్వాళ కోట్లాది ఆస్తులకు యజమానులు అయ్యారని మంత్రి అన్నారు.

ఇవ్వాళ మీరు ఈ స్థితిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే.. అలాంటి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి.. ఆ పార్టీ ద్వారా సంపాదించుకున్న వేల కోట్లతో వేరే పార్టీ పెట్టి ఊరేగుతున్నది మీరు కాదా అని షర్మిలను మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికైనా పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలని షర్మిలకు సూచించారు. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని మంత్రి హెచ్చరించారు.

కాగా, మహబూబాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌ను పరుష పదజాలంతో దూషించినట్లు బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెట్ లూనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.


First Published:  19 Feb 2023 5:43 PM IST
Next Story